Home / Politics / ఇప్పుడే.. యాదికొచ్చినమా అని అంటున్నా తెలంగాణ ప్రజలు?

ఇప్పుడే.. యాదికొచ్చినమా అని అంటున్నా తెలంగాణ ప్రజలు?

తాగునీళ్లు లేక అలమటిస్తున్నం. ఇగో ఈ ఖాళీ బిందెలు చూడండి.!
అర్హులైన రైతులకు పాసుపుస్తకాలు ఇవ్వకుండా భూముల వివరాలు వివాదాల జాబితా పార్ట్‌-బిలో ఎట్లా పెట్టిండ్రు!
పోయిన ఏడాది శంకుస్థాపన చేసిన రెండు పడక గదుల ఇళ్లు నేటికీ మొదలు పెట్టలేదు మీరు!
ఇచ్చిన హామీలు మరిచిపోయారా.. తొలుత  ఆ సమస్యలను పరిష్కరించండి!
ఓట్లప్పుడు ఓటు మల్లన్నలు.. ఓట్లయ్యాక బోడి మల్లన్నల్లా కనిపిస్తున్నామా.. ఎందుకు ఇన్నేళ్లు సమస్యలను పట్టించుకోలేదో తేల్చాలి.
ఇదీ నియోజకవర్గాల్లో తాజాగా అభ్యర్థులు ఎదుర్కొంటున్న నిరసనల సెగ. ఎన్నికల  ప్రచారంలో గ్రామాలకు వెళ్లిన నాయకులకు ఎదురవుతున్న అనుభవం.
ఈ ఎన్నికల్లో మంచి ఆధిక్యతతో గెలిపించండి అంటూ ఓట్లు అభ్యర్థించేందుకు వెళ్తున్న నాయకులకు ఒక్కసారిగా ఎదురవుతున్న వ్యతిరేకత నుంచి ఎలా బయటపడాలో ఆలోచించుకోవాల్సి వస్తోంది. ఇన్నాళ్లూ పరిష్కరించని స్థానిక సమస్యలు ఇప్పుడు మెడకు చుట్టుకుంటుండటంతో అభ్యర్థులు బావురుమంటున్నారు. ఇటీవల చాలా జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుండటం రాజకీయ వర్గాలను ఆలోచనల్లో ముంచెత్తుతోంది. మెదక్‌, సంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ, జనగామ, వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌, కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం సందర్భంగా పలువురు అభ్యర్థులకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి.

పథకాల అమలులో ఉదాసీనత ఫలితమే
మహోన్నత లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థాయిలో సక్రమంగా అమలు చేయని ఫలితమే నేడు నిరసనలకు కారణమని తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు పథకాల మంజూరుకు మాత్రమే పరిమితం కావడం, శంకుస్థాపనలపై దృష్టిసారించి కార్యాచరణను అమలు చేయకపోవడంతో అవి అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇలాంటి చోట్లే ఎక్కువగా నిరసనల సెగ తగులుతోంది. మరోవైపు మండల స్థాయిలో ప్రజాప్రతినిధులు, నాయకుల జోక్యం మితిమీరి ఉన్న చోట్ల కూడా సామాన్యులు నిలదీస్తున్నారు. ఇన్నాళ్లూ వారికి చెప్పినా పనులు కాకపోవడంతో ప్రస్తుతం అభ్యర్థులే గ్రామాలకు వస్తుండటాన్ని అనువుగా చేసుకుని ప్రజలు తమ ఆక్రందనను వ్యక్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ప్రచారానికి ప్రతిబంధకంగా మారుతున్న సంఘటనల్లో ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఆదివారం మెదక్‌ నియోజకవర్గంలోని చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి ఎస్సీకాలనీలో ప్రచారం నిర్వహించిన అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి వాహనశ్రేణిని స్థానికులు అడ్డుకున్నారు. రెండేళ్ల కిందట భూమిపూజ చేసిన రెండు పడకగదుల గృహాల పనులు నేటికీ ప్రారంభించలేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. భూ దస్త్రాల ప్రక్షాళనలో పట్టా పాసుపుస్తకాలు ఇవ్వలేదంటూ తుర్కల మాందాపూర్‌ గ్రామంలోనూ యువకులు, రైతులు ఆమె ప్రచారాన్ని అడ్డుకోవడం కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది.
పటాన్‌చెరు నియోజకవర్గంలోని లక్డారంలోనూ ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి మహిపాల్‌రెడ్డిని అడ్డుకుని ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. లోక్‌సభ సభ్యుడి దత్తత గ్రామమైన ఇక్కడ పక్షం రోజులకోమారు నీళ్లు వస్తున్నాయని, ఎవరూ పట్టించుకోలేదంటూ ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.
నర్సాపూర్‌ నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వలేదని తెరాస అభ్యర్థి మదన్‌రెడ్డి ప్రచారాన్ని స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. శివ్వంపేట మండలం పోతులబొగుడలోనూ రైతుల నుంచి నిరసన ఎదురయింది. పట్టాపాసుపుస్తకాలు ఇవ్వకుండా భూములను పార్ట్‌-బిలో చేర్చారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్‌లోనూ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌కు కాలనీవాసుల నిరసనల సెగ తాకింది.
తుంగతుర్తి నుంచి పోటీలో ఉన్న గాదరి కిశోర్‌ మోత్కూరు మండలంలో నిర్వహించిన ప్రచారంలో పట్టాపాసుపుస్తకాలు, రైతు బంధు, ఎస్సీ సామాజిక భవన నిర్మాణానికి ఇచ్చిన హామీ తదితరాలపై స్థానికుల నుంచి నిరసనల సెగ తగిలింది.
భువనగిరి అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డిని పోచంపల్లి మండలం శివారెడ్డిగూడెంలో రహదారి పనుల నిర్మాణం, భువనగిరి ఇందిరానగర్‌లో పింఛన్ల సమస్యపై నిలదీశారు.
ఆలేరు అభ్యర్థిని గొంగడి సునీత తమ సమస్యలు పరిష్కారం చేయలేదని ఆత్మకూరు (ఎం)లో గౌడ కులస్తులు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆలేరులో నిర్వహించిన చేనేతల ఆశీర్వాద సభలో.. తమకు మేలు చేయడం లేదంటూ కొందరు నిరసన వ్యక్తం చేశారు.
మునుగోడు తెరాస అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డికి చౌటుప్పల్‌, నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో నిరసనల సెగ తగిలింది. గ్రామాల అభివృద్ధి, కాలనీలలోని వసతులు తదితర అంశాలపై ప్రజలు ఆయనను నిలదీశారు.
మంత్రి ఈటలకు సైతం ప్రచారంలో మహిళల నుంచి నిలదీతలు తప్పలేదు.
మానకొండూరులో అభ్యర్థి రసమయి బాలకిషన్‌కు సమస్యలపై ప్రజల నుంచి ప్రతిఘటనలు ఎదురయ్యాయి.
గెలిచాక నాలుగేళ్లకు గుర్తొచ్చామా అంటూ కొత్తగూడెం అభ్యర్థి జలగం వెంకట్రావును ప్రచారం నిర్వహిస్తుండగా ప్రజలు  నిలదీశారు.
భద్రాచలం తెరాస అభ్యర్థికి పేరూరు పర్యటనలో వింత అనుభవం ఎదురైంది. ఎమ్యెల్యేగా గెలిచాక ఏం చేస్తారంటూ అక్కడి ప్రజలు ప్రశ్నించారు. సింగరేణిలో కారుణ్య నియామకాలు ఏమయ్యాయంటూ ఇల్లందులో అభ్యర్థి కోరం కనకయ్యను సింగరేణి కార్మికులు నిలదీశారు. వైకాపాకు ఓట్లేస్తే తెరాసలోకి ఎందుకెళ్లావంటూ అశ్వారావుపేటలో తాటి వెంకటేశ్వర్లును చంద్రుగొండ మండలం రవికంపాడు గ్రామస్థులు నిలదీశారు. పినపాక అభ్యర్థి వెంకటేశ్వర్లను కరకగూడెం మండలంలో పోడు భూములకు పట్టాల విషయమై ప్రశ్నించారు.
మహబూబాబాద్‌ అభ్యర్థి శంకర్‌నాయక్‌, మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యలకు వారివారి నియోజకవర్గాల్లో ప్రజల నుంచి నిరసనలు ఎదురయ్యాయి.
అక్కడక్కడ ప్రతిపక్షంలోని నాయకులను సైతం ఓటర్లు నిలదీస్తున్నారు. అధికారంలో లేము కాబట్టి సమస్యలను పరిష్కరించలేక పోయామని ఈ సారి అధికారంలోకి వచ్చాక తప్పక వాటిని పరిష్కరిస్తామంటూ వారు ప్రజలనుంచి తప్పించుకుంటున్నారు.

ప్రశ్నించే హక్కులేదా ?
మేం ఎన్నుకున్న అభ్యర్థులను.. మళ్లీ మీకు ఎందుకు ఓటువేయాలో ప్రశ్నించే హక్కు మాకు లేదా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో మద్దిరాల మండలం చందుపట్లలో ఇటీవల రెండు వర్గాల మధ్య జరిగిన వివాదం సందర్భంగా స్థానికులు లేవనెత్తిన ప్రశ్న ఇది. ఇప్పుడు కాకుంటే మరెప్పుడు వారిని అడుగుతామంటూ వారు అక్కడికి వచ్చిన పోలీసులను, నాయకులను ప్రశ్నించడం గమనార్హం.
సామాజిక మాధ్యమాలతో మరింత విస్తృతం 
భివృద్ధి ఫలాలు దక్కని వారు అసంతృప్తితో రగిలిపోతుండటం సహజం. ఎన్నికల్లో ఆయా వర్గాలు ఎలాగో తమ ఓటు ద్వారా నిరసన వ్యక్తం చేస్తారు. కానీ, మెజార్టీ సంఖ్యలోని ప్రజలకు సంబంధించిన సమస్యలే ఇలాంటి నిరసనలు, అడ్డగింతలకు కారణమవుతాయని విశ్లేషకులు వివరిస్తున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వినియోగం పెరగడంతో చిన్నచిన్న నిరసనలు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. గత ప్రభుత్వం హయాంలోనూ ఇలాంటివి చోటుచేసుకున్నప్పటికీ అప్పుడు సోషల్‌ మీడియా చైతన్యంగా లేకపోవడంతో పెద్దగా వెలుగులోకి రాలేదు.
ఇదంతా కాంగ్రెస్‌ నేతల కుట్రే
ప్రచారంలో తమకు ఎదురవుతున్న నిరసనలకు ప్రధాన కారణం కాంగ్రెస్‌ నాయకులేనని తెరాస అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తాము ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందారని, అక్కడక్కడ పలువురికి సంక్షేమ ఫలాలు అందకపోయినా తమకు కల్పించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారే తప్ప నిలదీయడం లేదంటున్నారు. తమకు లభిస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకే కాంగ్రెస్‌ నాయకులు కావాలని కొందరిని తమ మీదికి ఉసిగొల్పుతున్నారంటూ ప్రచారంలో పేర్కొంటున్నారు. ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన నియోజకవర్గాల్లో సైతం ప్రజలు వారిని నిలదీస్తున్నారని, అయినా అవి సామాజిక మాధ్యమాల్లో అంతగా ప్రచారంలోకి రావడం లేదంటున్నారు.
అడ్డగింతతో ఉద్రిక్తతలు
గ్రామాలకు వస్తున్న నాయకులను స్థానికులు సమస్యలపై నిలదీస్తున్న సందర్భంలో పోలీసులు, కార్యకర్తలు ప్రతిఘటిస్తుండడంతో అక్కడ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. లాఠీఛార్జి, తోపులాటలతో ఆ సంఘటనలు మరింత ప్రచారంలోకి వస్తున్నాయి. కొన్ని చోట్ల సమస్యలు విన్నవించే వారితో అభ్యర్థులు నేరుగా మాట్లాడి శాంతింపచేస్తుండటంతో సద్దుమణుగుతున్నాయి. ప్రజలకు, నాయకులకు మధ్య దూరం పెరిగినచోట ఇలాంటివి కనిపిస్తున్నాయన్న చర్చసాగుతోంది.

 

 

About admin

Check Also

అర్ధరాత్రి ఒక పక్క రేవంత్ అరెస్ట్, అదే సమయంలో గచ్చిబౌలిలో రేవంత్ ఆస్థుల పై, వైసీపీ నాయకుడి దౌర్జన్యం

గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో సర్వే నంబరు 126, 127లో ఉన్న కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *