Home / Politics / కేసీఆర్‌ మునుగుడే!

కేసీఆర్‌ మునుగుడే!

‘‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమి గెలుపు సాధించబోతోంది. సీఎం కేసీఆర్‌ స్వయంకృతాపరాధాలతో టీఆర్‌ఎస్‌ ఓడిపోబోతోంది. ప్రజల్లో అప్రతిష్ఠకు గురైన అనేకమంది ఎమ్మెల్యేలకు ఆయన టికెట్లిచ్చి మళ్లీ నిలబెట్టారు. వారెవరూ గెలిచే సూచనలు కనిపించడం లేదు. తన నిరంకుశ విధానాలతో సామాన్య ప్రజానీకాన్ని అవస్థల పాల్జేసిన మోదీకి లోపాయికారీ మద్దతు ఇస్తున్న నేతగా కేసీఆర్‌ను ప్రజలు భావిస్తున్నారు. కేసీఆర్‌ తప్పటడుగులే ఆయనను ముంచుతున్నాయి’’ అని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఉండవల్లిలోని ప్రజా వేదిక భవనంలో మంగళవారం టీడీపీ వ్యూహ కమిటీ సమావేశం జరిగింది. ఈ అంతర్గత సమావేశంలో తెలంగాణలో ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. వైసీపీ నేత జగన్‌, బీజేపీ మధ్య బంధాన్ని టీఆర్‌ఎస్‌ బయటపెట్టిందని కూడా ఆయన వెల్లడించారు.
‘‘తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జగన్‌ కారణంగా నిలిచిపోయిందని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. జగన్‌ ఒత్తిడితో బీజేపీ దానిని చేపట్టకుండా నిలిపివేసిందని ఆయన అన్నారు. బీజేపీ, జగన్‌ మధ్య ఉన్న లోపాయికారీ సంబంధాలకు ఇది నిదర్శనం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. మోదీ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వస్తుండటంతో సహజంగానే పెద్ద పార్టీ అయిన కాంగ్రె్‌సకు కలిసి వస్తోందని, దీనివల్ల రాహుల్‌ ఇమేజీ పెరుగుతోందని చెప్పారు. ‘‘దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న నినాదంతో ప్రతిపక్షాలు ఒకటి కావడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రజల్లో సానుకూలంగా వెళ్తున్నాయి. టీడీపీకి కేంద్రంలో అధికారం అవసరం లేదు. వ్యవస్థలు బలంగా ఉండి.. ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే చాలు. దానివల్ల రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది’’ అని వివరించారు.
కాగా రాష్ట్ర విభజన జరిగినా.. తెలుగువారిగా ఒక్కటిగా ఉండాలని కోరుకున్నానని చంద్రబాబు తెలిపారు. ‘‘హైదరాబాద్‌ ఇప్పుడు ప్రపంచ పటంలో ఉన్నతంగా ఉందంటే దానికి నా కష్టమే కారణం. హైటెక్‌ సిటీ, సైబరాబాద్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, శంషాబాద్‌ విమానాశ్రయం.. వీటన్నింటికీ తెలుగుదేశమే నాంది పలికింది. నేను సీఎంగా ఉన్నప్పుడే ఇవన్నీ జరిగాయి. ఆ రోజు తెలుగు జాతి కోసం హైదరాబాద్‌ నిర్మాణం చేశాం. విభజన తర్వాత దానిని అక్కడ ఉన్నవారు అనుభవిస్తున్నారు. నవ్యాంధ్రలో మరో నగరాన్ని నిర్మించే శక్తిని భగవంతుడు నాకు ఇచ్చాడు’’ అని వ్యాఖ్యానించారు. విజయవాడలో ఆశా వర్కర్ల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

 

About admin

Check Also

అర్ధరాత్రి ఒక పక్క రేవంత్ అరెస్ట్, అదే సమయంలో గచ్చిబౌలిలో రేవంత్ ఆస్థుల పై, వైసీపీ నాయకుడి దౌర్జన్యం

గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో సర్వే నంబరు 126, 127లో ఉన్న కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *