Home / Politics / జాతీయ రాజకీయాల్లో దక్షిణ భారత పార్టీల ప్రాధాన్యం పెరగాలి – శ్రీ పవన్ కళ్యాణ్ గారు…

జాతీయ రాజకీయాల్లో దక్షిణ భారత పార్టీల ప్రాధాన్యం పెరగాలి – శ్రీ పవన్ కళ్యాణ్ గారు…

దక్షిణ భారత రాజకీయ పార్టీలన్నీ ఒక తాటి మీదకు రావలసిన అవసరం ఉంది… ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు దేశ రాజకీయాలను శాసించే విధానాన్ని మార్చాలి అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు పిలుపునిచ్చారు.

మనవి చిన్న పార్టీలు కావచ్చు కానీ మనమంతా కలిసి నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరు దేశాన్ని పాలించాలో ఆ రాష్ట్రాల వారే నిర్ణయిస్తున్నారు.. దేశ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాలని చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు ఈ విశాల దేశానికి రెండో రాజధాని నగరం అవసరం అని చెప్పారు. అంబేడ్కర్ చెప్పిన విధంగా జనసేన పార్టీ నుంచి దక్షిణ భారతదేశం నుంచి రెండవ రాజధాని ప్రకటన జరగాలి అనే విషయాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్తుంది అన్నారు. ఉత్తరప్రదేశ్ ఒక్కటే దేశ రాజకీయాల్ని శాసిస్తుంటే దక్షిణ భారతానికి జరుగుతున్న అన్యాయంపై మాట్లాడేది ఎవరని ప్రశ్నించారు.  బుధవారం తమిళనాడు రాజధాని చెన్నైలో శ్రీ పవన్ కల్యాణ్ గారు విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. తొలుత తమిళంలో మీడియాకు నమస్కారం తెలిపి కొద్దిసేపు తమిళంలో మాట్లాడారు. జనసేన పార్టీ ఏర్పాటు నేపథ్యాన్ని, తన ఆలోచనల్నీ తెలియచేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ.. “విభజన సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశాయి. ఆ మోసాన్ని చక్కదిద్దడానికే జనసేన పార్టీ పుట్టింది. రాష్ట్ర విభజన అనేది తొలుత బీజేపీ నుంచి వచ్చిన మాటే. సమకాలీన రాజకీయ వాతావరణం పరిశీలిస్తున్నప్పుడు… జనసేన పార్టీ పుట్టడానికి సంబంధించిన నేపథ్యాన్ని కూడా చెప్పాలని అనిపిస్తుంది. నిజానికి నాకు రాజకీయాల్లోకి రావాలి, ప్రజలకోసం ఏదైనా చేయాలి అనే ఆలోచన ఈనాటిది కాదు. 2003లోనే రాజకీయాల్లోకి రావాలని అనుకున్నాను. తొలుత కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరుతో సీపీఎఫ్ ను ప్రారంభించాను. రెండేళ్లపాటు కార్యక్రమాలు నిర్వహించిన తరువాత.. చిరంజీవి గారు ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం విభాగానికి నేతృత్వం వహించాను. ఆ తర్వాతి కాలంలో.. గాడితప్పిపోయిన రాజకీయాలు చూసి – రాజకీయంగా జవాబుదారీతనం పెరగాలనే ఉద్దేశంతోనే జనసేన పార్టీని స్థాపించడం జరిగింది.

2014 ఎన్నికల సమయంలో అప్పటి దేశ, రాష్ట్ర అవసరాల దృష్ట్యా నరేంద్రమోడీ నాయకత్వం, చంద్రబాబునాయుడు అనుభవం రాష్ట్రానికి అవసరం అనే ఉద్దేశంతో ఆ పార్టీలకు మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే గెలిచిన తర్వాత.. చంద్రబాబునాయుడు పక్కన పెట్టారు. ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వంలో అవినీతి వేళ్లూనుకుంది. ఇవాళ చంద్రబాబు ప్రభుత్వంలో చూస్తే.. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ వెయ్యి కోట్ల రూపాయలకు పైగా అవినీతి తాండవిస్తోంది. సాగు నీటి ప్రాజెక్టుల నుంచి ప్రతి చోట అవినీతి తాండవిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఏపీని బాధిస్తోంది. అది వైట్ కాలర్ అవినీతి. ప్రజల కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చా. మేము కులాలకు వ్యతిరేకం. మా పార్టీ సిద్ధాంతాల్లో అదీ ఒకటి. చివరి వరకూ మేము దీన్నే నమ్ముతాం. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది. దక్షిణాదిలో మరింత మంది నీతివంతమైన రాజకీయ నాయకులు రావాలి. ఉదాహరణకు జగన్‌ను తీసుకుంటే, ఆయనపై ఉన్న కేసుల కారణంగా కనీసం నీతివంతమైన నాయకుల అవసరంపై మాట్లాడే ధైర్యం కూడా జగన్‌ చేయలేరు. 2019లో తప్పకుండా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిని అవుతాను. దేశ రాజకీయాల్లో జనసేనది కీలక భూమిక అవుతుంది. రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఎంతో అన్యాయం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో వెనక్కు తగ్గి తెలుగు ప్రజలను ఆ పార్టీ మోసం చేసింది. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు సమీకరిస్తున్న కాంగ్రెస్ అనుకూల కూటమిలో చేరే ఆలోచనేమీ లేదు. చంద్రబాబునాయుడును ఏ విషయంలోనూ నమ్మలేం. చంద్రబాబు ఇవాళ ఒక పార్టీని నెత్తిన పెట్టుకుంటే.. రేపు దాన్ని కింద పడదొయగలరు. చంద్రబాబు గారు చెప్పే మహా కూటమితో ఎవరు పొత్తు పెట్టుకున్నా సరే భవిష్యత్తులో ఆయన వారిని చాలా దారుణంగా మోసం చేయగలరు. చంద్రబాబు గారు చాలా ప్రమాదకరమైన వ్యక్తి.  అయితే తగిన సమయంలో ఏయే పార్టీలతో కలవాలనే విషయంలో నిర్ణయం తీసుకుంటాను. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ… ఈ మూడు పార్టీలు ఏ ఎండకు ఆ గొడుగు పడతాయి. దేశానికి నిఖార్సైన పార్టీల అవసరం ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు గురించి చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం, మాటలు ఊహాగానాలే. అన్ని స్థానాల్లో మా పార్టీ పోటీ చేస్తుంది. తెలంగాణలో 19నుంచి 23 స్థానాల్లో పోటీచేయాలని అనుకున్నప్పటికీ.. ముందస్తు వల్ల సాధ్యం కాలేదు. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బరిలో ఉంటాం. నిబద్ధత, సహనం ఉన్న ఏ నటుడైనా రాజకీయాల్లోకి రావచ్చు. రాజకీయాల్లోకి వచ్చే నటులు కావచ్చు, వేరేవారైనా సరే వారికి చాలా సహనం కావాలి, కనీసం రెండు దశాబ్దాల పాటు మార్పు కోసం పోరాడే ఓర్పు కావాలి. 2014లో జనసేన పార్టీని భాజపాలో విలీనం చేయమని అడిగారు. ఎట్టి పరిస్థితుల్లో నేను అలా చేయనని చెప్పా. ఎందుకంటే వారు బాధ్యత కలిగిన వారు కాదు. జవాబుదారీతనం కూడా లేదు. నేను ఎప్పటికీ బీజేపీ స్నేహితుడిని కాదు. నా అన్నయ్య చిరంజీవి గారికే వ్యతిరేకంగా వెళ్లినవాడిని.. అలాంటిది మోదీ కనీసం నా సోదరుడు కూడా కాదు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగానే వెళ్తాం. త్రిముఖ పోరు తప్పదు.

2019 ఎన్నికలు ప్రాంతీయ పార్టీల చేతిలోనే..

దక్షిణ భారత దేశంలోని పార్టీలకు జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం పెరగాల్సిన అవసరం ఉంది. తమిళనాడులోని అన్ని పార్టీల నాయకులతోనూ త్వరలోనే సమావేశం అవుతానన్నారు. ఉత్తరాది పార్టీల ఆధిపత్యాన్ని, పెత్తనాన్ని సహించను. మన రాష్ట్రాల నుంచి ఎక్కువ ఆదాయం కేంద్రానికి వస్తున్నప్పటికీ సరైన రీతిలో నిధుల పంపకం జరగట్లేదు, దీని మీద కేంద్ర ప్రభుత్వం సమీక్షలు జరిపి నిర్ణయాలు తీసుకోవాలి, ఎంపీల సంఖ్య ఆధారంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. ముందుగా నేను అన్ని రాష్ట్రాలలో తిరిగి జనసేన సిద్ధాంతాలు తెలియజేయాలి అనుకుంటున్నా. ద్రవిడ సంప్రదాయాల్ని అర్థం చేసుకోకుండా ఇక్కడి సంప్రదయాలపై దాడులు చేయడం వలన జల్లికట్టు లాంటి ఉధృత ఉద్యమం వచ్చింది. జల్లికట్టు కోసం మీరు పోరాడిన తీరు స్ఫూర్తిదాయకం. యువత ముందుకు వస్తే ఎలాంటి మార్పు తీసుకురాగలరో జల్లికట్టు నిరూపించింది. 2019 ఎన్నికలు ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి ఉంటాయి, ఎక్కువగా సంకీర్ణ ప్రభుత్వాలు మాత్రమే ఉంటాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి శ్రీ జయలలిత గారు ఉన్నప్పుడు నేను షూటింగ్ కోసం ఇక్కడ పొలాచ్చి ప్రాంతానికి వచ్చేవాడిని, అప్పుడు బీజేపీ మీద ఇక్కడి యువతకు ఉన్న ఆవేశాన్ని చూశాను. జాతీయ పార్టీ ఇక్కడి రాజకీయాల్లో తల దూర్చడం ఇక్కడి యువతకు నచ్చలేదు, ఇక్కడి ఆచారాల పట్ల వారి తీరు ఇక్కడి ప్రజలకు నచ్చలేదు, దాని ప్రభావం ఒక జల్లికట్టు లాంటి పెద్ద పోరాటానికి పిలుపు ఇచ్చింది. జల్లికట్టు ని ఒక ఉద్యమంగా చూడలేదు, అది బీజేపీ మీద ఉన్న కోపం, ఇక్కడి ప్రజల ఆవేశం, వారి ఆత్మాభిమానాన్ని రక్షించుకోవడం కోసం చేసిన పోరాటంలా చూశాను. రాష్ట్ర రాజకీయాల్లో జాతీయ పార్టీలు వేలు పెట్టడం, నోట్ల రద్దు, జయలలిత గారి మరణానంతరం జరిగిన పరిణామాలు బీజేపీ మీద విపరీతమైన కోపాన్ని తెప్పించింది పదేళ్లకు పైగా తెలంగాణలో తెలంగాణ లీడర్లు ఆంధ్రావాళ్లను ద్వితీయ శ్రేణి పౌరులు లాగా చూస్తూ వచ్చారు.  ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇదంతా మనస్తాపం కలిగించింది.  చెన్నైలో ఉన్నప్పుడు కూడా అలాంటి పరిస్థితిని నేను ఎన్నడూ అనుభవించలేదు.  తమిళనాడుకు జనసేన పార్టీని పరిచయం చేయడానికే చెన్నై వచ్చాను. చంద్రబాబుకు రిటైర్ మెంట్ దగ్గరపడింది. పంచాయతీ మెంబరుగా కూడా గెలవలేని నారా లోకేష్ ను మంత్రిని చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు జనసేనతో ముడిపడి ఉంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. మా పార్టీ స్టాండ్‌ ఎటువైపు తీసుకుంటుందో త్వరలోనే చెబుతా”అన్నారు.

About admin

Check Also

అర్ధరాత్రి ఒక పక్క రేవంత్ అరెస్ట్, అదే సమయంలో గచ్చిబౌలిలో రేవంత్ ఆస్థుల పై, వైసీపీ నాయకుడి దౌర్జన్యం

గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో సర్వే నంబరు 126, 127లో ఉన్న కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *