Home / Politics / ఎమ్మెల్యే ‘నరేంద్ర’ మంచివారే..కానీ..!?

ఎమ్మెల్యే ‘నరేంద్ర’ మంచివారే..కానీ..!?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రహస్యంగా జరిపిస్తున్న ఐవిఆర్‌ఎస్‌ సర్వేతో పాటు, ఇతర సర్వేల్లో ఎమ్మెల్యేల కన్నా..వారి అంతరంగిక సిబ్బంది, ఇతర సన్నిహిత నాయకులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయిందట. ముఖ్యంగా ‘పొన్నూరు’ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ‘నరేంద్రకుమార్‌’ మంచివాడు అని, ఆయన లంచాలు తీసుకున్నట్లు ఎప్పుడూ చూడలేదని, ఆయన ఏమేమి వ్యాపారాలు చేసుకుంటున్నాడో తెలియదని, కానీ..ఆయన పక్కన ఉండే ఆయన బంధువు అధికారాన్ని అడ్డదిట్టంగా చెలాయిస్తూ…బాగా వెనకేసుకున్నారని సర్వేలో పలువురు చెప్పారు. అంతే కాకుండా అనేక గ్రామాల్లో స్థానికంగా ఉన్న బలమైన నేతలు తెరమరుగు అయ్యారని, మరి కొందరు కాలం చేశారని, ప్రస్తుతం ఏక నాయకత్వంలో నడిపించే నాయకుడు లేరని, ఈ విషయంలో ఎమ్మెల్యే నరేంద్ర ఎవరినీ ఎదగనీయలేదని చెప్పారు.

Image result for mla narendra

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అధికారం చెలాయించి, టిడిపి కార్యకర్తలను, సానుభూతి పరులను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన విషయం మరిచిపోయారు స్థానిక టిడిపి నాయకులు. ఎవరైతే ఆ విధంగా దౌర్జన్యాలు, బెదిరింపులు చేశారో అటువంటి వారే ఇప్పుడు వైకాపా నాయకులుగా చెలామణి అవుతున్నారు. స్థానిక టిడిపి నేతలమని చెప్పుకుంటున్న వారు, వైకాపా నేతలతో విందు,వినోదాలతో మునిగితేలడమే కాకుండా కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం కల్పిస్తున్నారని సర్వేలో చెప్పారట. ఈ విషయాలన్నీ ఎమ్మెల్యే నరేంద్రకుమార్‌కు తెలుసనని, అయినా ఆయన ఎందుకు మౌనం వహిస్తున్నారో తెలియడం లేదన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే వెంట ఉండేవారు, గ్రామ, మండల స్థాయిలో అధికారులు, ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌ల్లో ఎమ్మెల్యే నరేంద్రను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలుస్తోంది.

ఇదే విషయాన్ని కొందరు నాయకులు స్థానిక మీడియాతో మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే నరేంద్ర అమాయకుడని, కొంత మందిని గుడ్డిగా నమ్మి రాజకీయంగా నష్టపోయారని, ఈ విషయం తెలుసుకునే వరకు జరగవల్సిన నష్టం జరిగిందని, వాటిని సరిదిద్దేందుకు ‘నరేంద్ర’ నడుం బిగించారని కొందరు నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనా ‘పొన్నూరు’ నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో పార్టీ సానుభూతిపరులు అనేక సంఖ్యలో ఉన్నప్పటికీ..వారందరినీ ఏకతాటిపై నడిపించే నాయకుడు లేడు.’నరేంద్ర’ తండ్రి ‘వీరయ్యచౌదరి’ హయాంలో ఎటువంటి నాయకులు ఉండేవారు..పార్టీకి ఎంత విధేయతగా ఉండేవారు, కుటుంబ సభ్యులైనా, సమీప బంధువులైనా టిడిపి పార్టీని వ్యతిరేకిస్తే, వారితోమాట్లాడడం కానీ, వారి ఇంట్లో శుభకార్యానికి వెళ్లేవారు కాదు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతోంది.

ఆర్థికపరంగా టిడిపి నాయకులు ఎంతో ఎత్తుకు ఎదిగారు. చివరకు స్వపక్షీయులు అసూయపడే స్థాయికి చేరుకున్నారు.అంతే కాదు స్థానిక వైకాపా నాయకులకు కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం ఇచ్చి వారిని ఆర్థికంగా స్థితిమంతులను చేశారు. మరో మూడు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్ననేపథ్యంలో ఎమ్మెల్యే నరంద్ర ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇప్పటికైనా సరిదిద్దుకోవాలి. లేకుంటే పరిస్థితి విషమిస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే పిఎగా చెప్పుకుంటున్న సన్నిహిత బంధువులను ఎంత దూరం పెడితే అంత మంచిదని ‘నరేంద్ర’కు పలువురు సూచించడం జరిగింది. మూడు మండలాలు, పొన్నూరు పట్టణ ప్రాంతంలో పరిస్థితిని చక్కదిద్దుకోకపోతే డబుల్‌ హ్యాట్రిక్‌ సెంటిమెంట్‌కు బలవడం ఖాయమని, పరిస్థితిని చక్కదిద్దుకుని అందరినీ ఒకే తాటిపై నడిపించగలిగితే గుంటూరు జిల్లా చరిత్రలో డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించిన నేతగా ‘నరేంద్ర’ చరిత్రలో మిగిలిపోతారు. సెంటిమెంట్‌కు బలయ్యేందుకు అవకాశం ఇస్తారా..? లేదా..? ఆ సెంటిమెంట్‌ను అవలీలగా ఎదుర్కొని చరిత్ర సృష్టించి నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో పేరు తెస్తారా..? మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

About admin

Check Also

అర్ధరాత్రి ఒక పక్క రేవంత్ అరెస్ట్, అదే సమయంలో గచ్చిబౌలిలో రేవంత్ ఆస్థుల పై, వైసీపీ నాయకుడి దౌర్జన్యం

గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో సర్వే నంబరు 126, 127లో ఉన్న కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *