Home / News / గుంటూరు జిల్లా నుంచి వైకాపాలో నలుగురు అవుట్ : మరింత బలపడుతున్న టిడిపి

గుంటూరు జిల్లా నుంచి వైకాపాలో నలుగురు అవుట్ : మరింత బలపడుతున్న టిడిపి

వైసీపీ అధినేత జగన్‌… ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎప్పుడు ఎవరిని పక్కన పెడతారో అర్థంకాక ఆ పార్టీ నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో పాటు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు సైతం సతమతం అవుతున్నారు. నియోజకవర్గాల ప్రజలు ఎన్నడూ ఎరగని కొత్త ముఖాలను తెరపైకి తెస్తూ విధేయుల ఏరివేత కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఓదార్పు యాత్రల పేరుతో ఎవరెవరినో ఓదార్చే జగన్మోహన్‌ రెడ్డి… టిక్కెట్టును ఆశిస్తూ ఇప్పటి వరకు తనతో పయనిస్తున్న ఔత్సాహికులను ఒక్కమారు కూడా ఓదార్చకుండా వేటు వేస్తుండటంతో ఆ పార్టీలో కలకలం రేకెత్తుతోంది. ఇప్పటికే జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కొత్తవారిని రంగంలోకి దించి పార్టీ కేడర్‌ విమర్శలకు గురైనప్పటికీ జగన్‌ తన ధోరణి మార్చుకోవడం లేదు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ ని పక్కన పెట్టిన జగన్, గుంటూరు లో లేళ్ల అప్పిరెడ్డి ని దూరం పెట్టారు. దీనితో ఇప్పటికే ఈ రెండు స్థానాల్లో టిడిపి బలపడగా, తాజాగా మరొక నలుగురు ని పీకేసాడు జగన్ మోహన్ రెడ్డి.

వివరాల్లోకి వెళ్తే తాడికొండ ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్‌ శ్రీదేవి పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ఆ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న కత్తెర క్రిస్టినాపై వేటు వేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వారం క్రితమే ప్రచారం జరిగింది. క్రిస్టినా గత ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి ఓటమి చెందిన విషయం తెలిసిందే. తిరిగి తనకే సీటు అనే భావనలో ఉన్న క్రిస్టినా ఈ నాలుగేళ్ళుగా ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఎన్నికలు సమీపించే ముందు తనకు సీటు లేదనే విషయం తెలియడంతో ఆమె మనస్తాపానికి లోనయ్యారు. ఆమెకు బదులుగా తెరపైకి వచ్చిన డాక్టర్‌ శ్రీదేవి హైదరాబాద్‌లో స్థిరపడిన డాక్టర్‌గా చెబుతున్నారు. దాదాపు టిక్కెట్‌ ఆమెదేనని చెబుతున్న ప్పటికీ ఆమె పూర్వాపరాలు ఇంకా తెలియరాలేదు. మంగళగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. పార్టీకి, జగన్‌కు ఆర్కే తొలి నుంచి వీరవిధేయుడుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఓదార్పు యాత్రల సమయంలో ఎంతో వ్యయం చేసుకొని రాష్ట్రమంతటా పార్టీ అధినేత జగన్‌ను నీడలా వెన్నంటి పయనించారు. అంతేకాదు, ఏ మాత్రం రాజీ పడకుండా అధికార పార్టీపై ఎన్నో పోరాటాలు చేశారు. రాజధాని ప్రాంత ఎమ్మెల్యేగా ఉండటంతో ఒక రకంగా తెలుగుదేశంకు, సీఎం చంద్రబాబుకు తరచూ కంట్లో నలుసుగా మారి కోర్టు కేసుల ఆర్కేగా పేరుగడించారు. అయితే మొదట్లో తానే ఈ సారి పోటీ చేయలేనని, కొంత ఆర్థిక ఇబ్బందులు మూలంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నానని జగన్‌కు చెప్పగా ఆయన మౌనం వహించడమే తప్ప.

తిరిగి పోటీ చేయాలని ఒత్తిడి చేయలేదని తెలిసింది. కాగా అప్పో సొప్పో చేసి ఆర్థిక వనరులు సమకూర్చుకున్న ఆర్కే… కొద్ది రోజుల క్రితం తిరిగి తాను పోటీకి సిద్ధమని చెప్పగా నీపై నియోజకవర్గంలో అసమ్మతి ఉంది, వారందరినీ కలుపుకొని వస్తేనే టిక్కెట్‌ ఇస్తానంటూ పరోక్షంగా టిక్కెట్‌ లేదని చెప్పేసినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో పెదకూరపాడులో పోటీ చేసి ఓడిన బ్రహ్మ నాయుడు ఆ నియోజక వర్గాన్ని వదిలేసి వచ్చిన సమయంలో గత్యంతరం లేక గుంటూరు నగరానికి చెందిన మాజీ కార్పొరేటర్‌ కావటి మనోహర్‌ నాయుడును సీటు నీదేనని నమ్మించి అక్కడికి జగన్‌ పంపారు. మూడేళ్ళుగా ఆ నియోజకవర్గంలో బలం పుంజుకునేందుకు అష్టకష్టాలు పడుతూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్ళూరుతున్న సమయంలో కావటికి నిద్రలేకుండా పోయింది. కొద్దికాలం క్రితం మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను వైసీపీలోకి చేర్చుకొని పెదకూరపాడు సీటు ఇవ్వాలని మంతనాలు జరపగా, అప్పట్లో కావటి షాక్‌కు గురయ్యారు. ఇప్పుడు కొత్తగా తుళ్లూరు మండలం పెదపరిమికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శంకరరావు పేరు కొద్ది రోజులుగా తెరపైకి వచ్చింది.ఇక వేమూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన మేరుగ నాగార్జునకు కూడా ఈ సారి సీటు కష్టమేనని అంటున్నారు. నాగార్జున ఓటమిపాలైనప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీకి సారథ్యం వహిస్తూ కేడర్‌కు వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. అయితే ఆ నియోజకవర్గం నుంచి రంగంలోకి దించేందుకు తగిన అభ్యర్థి ఎంపిక ఇంకా ఒక కొలిక్కి రాలేదని సమాచారం. అదే విధంగా మరో ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు జనంలో ఇమేజ్‌ ఉన్నప్పటికీ ఆర్థిక స్తోమత తగినంతగా లేదనే వంకతో వేటు వేసే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

About admin

Check Also

ముకేశ్‌ మ్యాజిక్‌!

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ స్థానం దక్కింది. గత ఏడాది (19వ స్థానం)తో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *