Home / News / తీరం దాటిన ‘తితలీ’…వణుకుతున్న ఉత్తరాంధ్ర

తీరం దాటిన ‘తితలీ’…వణుకుతున్న ఉత్తరాంధ్ర

శ్రీకాకుళం జిల్లాలో ‘తితలీ’ తుఫాను తీరం దాటింది. వజ్రపుకొత్తూరు మండలం తుఫాను తీరాన్ని దాటింది. తుఫాను తీరం దాటిన ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రకు తుఫాను ముప్పుపై వాతావరణ శాఖ ముందే రెడ్ మెసేజ్ జారీ చేసింది. వాతావరణ శాఖ అంచనాలకు తగ్గట్టుగానే జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజామున రెండు గంటల సమయం వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు- పల్లెసారథి వద్ద తుఫాను తీరాన్ని తాకింది. ఆ తరువాత మెల్లగా తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో గంటలకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. సురక్షిత ప్రాంతాల్లో ప్రజలు తలదాచుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 53 కిలోమీటర్ల మేర తుఫాను కేంద్రం విస్తరించి ఉంది.
తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం అంతటా పెను గాలులు వీస్తున్నాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుఫాను ప్రభావం ఉద్దానం ప్రాంతంపై ఎక్కువగా కనిపిస్తోంది. ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, నందిగాం, పలాస, వజ్రపుకొత్తూరు, మెళియాపుట్టి మండలాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, సోంపేటలో కుండపోత వర్షం కురుస్తోంది. తుఫాను ప్రభావంతో ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాల్లో గంటలకు 140 నుంచి 150 ఒక్కోసారి 165 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి.
బుధవారం రాత్రి నుంచే ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురవడం మొదలయ్యాయి. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాలో, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టిగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండటంతో తీరం వెంబడి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు ప్రవేశించే అవకాశం ఉంది.
 
ముందుకు వచ్చిన సముద్రం
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరు కవిటి మండలం కొత్తపాలెం వద్ద అలలు ఎగిసిపడుతున్నాయి. ఇక్కడ 20 నుంచి 30 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. సంతబొమ్మాళి మండలంలోని డి మరువాడ ప్రాంతంలో సముంద్రం ముందుకు వచ్చింది. ఇసుక దిబ్బలు కోతకు గురయ్యాయి. హుద్‌హుద్ తర్వాత ఈ స్థాయిలో గాలులు వీయడం ఇప్పుడే చూస్తున్నామని మత్స్యకారులు తెలిపారు.
విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామం వద్ద సముద్రం బుధవారం 150 అడుగుల ముందుకు వచ్చింది. భీకర శబ్ధంతో అలలు తీరంపై విరుచుకుపడుతుండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. కొండ్రాజుపాలెంలో మత్స్యకారుల పడవలు, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కృష్ణా జిల్లాలోనూ తుఫాను ప్రభావం కనిపిస్తోంది. తీర ప్రాంతాలైన పాలకాయితిప్ప, బసవన్నపాలెం, ఊటగుండ తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తున్నాయి.
తూర్పునావికా దళం సిద్ధం
తితలీ తాకిడికి దెబ్బతినే ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడానికి తూర్పునావికా దళం సిద్ధమైంది. ఒడిశాతో పాటు కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి నష్టం జరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన తూర్పు నావికాదళం ముందస్తు ఏర్పాట్లు చేసింది.

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *