Home / News / ఎదగని మనసు… మాట వినని వయసు!

ఎదగని మనసు… మాట వినని వయసు!

                                                        ఎదగని మనసు… మాట వినని వయసు!
                                                                      ఆకర్షణ మత్తులో యువత విలవిల
                                                                       అన్నీ తెలుసుననే భరోసాతో పెళ్లి పీటలపైకి
                                                                       ఊహల్లో తేలిపోతూ ఒకటవుతున్న జంటలు

ఉదయం నుంచి నిద్రపోయేంత వరకూ ఏదో విషయమై కీచులాడుకునే తల్లిదండ్రులు… అన్నయ్య ఉన్నా లేనట్టే… భార్యాభర్తలిద్దరూ తప్పొప్పులు ఎంచుకుంటూ పోట్లాటతో పిల్లలపై నియంత్రణ కోల్పోయారు… అర్ధరాత్రి ఇల్లు చేరిన కొడుకు అప్పటిదాకా ఏం చేశావంటూ అడిగేవారు లేరు… సెల్‌ఫోన్‌లో మునిగి తేలుతున్న కన్నకూతురుపై అజమాయిషీ లోపించింది.. ఫలితంగా… కొడుకు గంజాయి సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కాడు. కుమార్తె నచ్చినవాడితో ఎటో వెళ్లిపోయింది. తమ అమ్మాయిని వెతికించాలంటూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

అమ్మాయి వయసు 16…  ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానంటూ మొండిపట్టు పట్టింది. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. బాలిక మనసు మార్చేందుకు మనస్తత్వ నిపుణుల దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడా.. ఇదే వాదన. అన్నీ నాకు తెలుసు. మా అమ్మకే ఏమీ తెలియదంటూ గొడవకు దిగింది. ఆ యువకుడే తన భర్తగా భావించానని.. ఇద్దరి మధ్య సంబంధం ఎంతవరకూ వెళ్లిందో వివరించింది. తనను బాగా చూసుకుంటాడని… మంచివాడంటూ కితాబునిచ్చింది. ఇది విన్న వైద్యుడితోపాటు.. బాలిక తల్లి విస్మయానికి గురయ్యారు.

పెద్దలను ఎదిరించి.. మా బతుకు మేం బతుకుతామంటూ పెళ్లిపీటలెక్కుతున్నారు. పరిణతి చెందని వయసులో ఎవరిమాటా లెక్క పెట్టకుండా మూడుముళ్లతో ఒక్కటవుతున్నారు. సమాజంలో తమ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగిందనే అక్కసుతో కన్నవారి కోపతాపాలకు బలవుతున్నారు. ప్రేమ పెళ్లిళ్లు కొత్తేమీ కాకున్నా.. ఇప్పటి యువతీ యువకులు మరో అడుగు ముందుకేస్తున్నారు. కౌమారదశలోకి ప్రవేశిస్తూనే ప్రేమవలలో చిక్కి విలవిల్లాడుతున్నారు.  నగరంలో బుధవారం ఎర్రగడ్డలో జరిగిన సంఘటన అందరినీ ఉలికిపాటుకు గురిచేసింది. కులాంతర వివాహం చేసుకుందనే అక్కసుతో కన్నతండ్రి మనోహరాచారి చేతిలో కత్తివేటుకు గురైంది మాధవి. నాలుగేళ్లుగా ప్రేమిస్తున్న సందీప్‌ అనే యువకుడిని పెళ్లి చేసుకోవటమే ఇందుకు కారణమని పోలీసులు నిర్ధారించారు. కుటుంబం పరువు బజారున పడిందనే ఒకేఒక్క కారణమే ఈ ఘాతుకానికి దారితీసింది.  వారం క్రితం మిర్యాలగూడలో.. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఘటనల నేపథ్యం ఒక్కటే.

హార్మోన్లపై కోల్పోతున్న నియంత్రణ.. ఆడుతూ పాడుతూ పెరిగిన బాల్యం.. అమ్మానాన్నలు చెప్పినట్టే నడుచుకుంటారు. యుక్తవయసులోకి రాగానే పెద్దవాళ్లమయ్యామనే భావనకు చేరుతున్నారు. హార్మోన్ల ప్రభావంతో శారీరకంగా, మానసికంగా వచ్చిన మార్పులు వారిని కొత్తదనం వైపు అడుగులు వేసేలా ప్రేరేపిస్తాయి.  ఒకరిపట్ల మరొకరు తేలికగా ఆకర్షితులవుతున్నారంటున్నారు న్యూరోసైక్రియాట్రిస్టు డాక్టర్‌ హరీష్‌రెడ్డి. గతంలో తరగతి గదిలో, బయట మాట్లాడుకునేవారు. హార్మోన్ల ప్రభావం అంతవరకూ ఉండేది. ఇప్పుడు సెల్‌ఫోన్ల కారణంగా గంటల తరబడి ముచ్చట్లు.. పరస్పరం ఫొటోలు పంపుకోవడం.. హద్దులు మీరుతూ హార్మోన్లపై నియంత్రణ కోల్పోతున్నారంటూ ఆయన వివరించారు. పిల్లల పెంపకంపై పట్టుకోల్పోయిన కుటుంబాల్లోని పిల్లలు అధికశాతం ఇటువంటి ప్రేమ పెళ్లిళ్ల వైపు మొగ్గుచూపుతున్నట్లు ఆయన విశ్లేషించారు. మా ఇష్టం అనే విచ్చలవిడితనం క్రమంగా పెరగటమూ ఇటువంటి పరిణామాలకు మరో కారణమని వివరించారు.

పెడదారి పడుతున్న స్వేచ్ఛ.. గ్రామాల్లో స్థానికులు ‘మీరు ఫలానా వారి పిల్లలు కదా’ అని  గుర్తిస్తారు. ఒకరకంగా ఇది సామాజిక భద్రతే. నగరంలో ఇల్లుదాటి బయటకు వస్తే చాలు ఎవరిని ఎవరూ గుర్తుపట్టే అవకాశమే లేదు. దర్జాగా చెట్టపట్టాల్‌ వేసుకుని తిరిగినా అడ్డుకునేవారుండరు. ఇటువంటి స్వేచ్ఛ యువతను పెడదారి పట్టిస్తోందని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. పిల్లలను దండిస్తే ఏ అఘాయిత్యం చేసుకుంటారోననే భయం కన్నవారిని వేధిస్తోంది. తప్పులను మందలించలేని స్థితిలో తల్లిదండ్రులు వారి చేష్టలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.

వినిపించుకోలేని స్థితికి…
మంచిచెడులు చెప్పినా.. వినిపించుకోలేనంత స్థితికి ఈ కాలం యువత చేరిందంటూ ఓ పోలీసు అధికారి ఆందోళన వెలిబుచ్చారు. మేం మేజర్లం.. పెళ్లి చేసుకుంటే తప్పేమిటంటూ కౌన్సెలింగ్‌ ఇచ్చే సమయంలో తమనూ బెదిరిస్తున్నారని ఓ ఏసీపీ తన అనుభవాన్ని వివరించారు. తాము చెప్పిందే సరైనదనే భావన, స్వేచ్ఛగా బతికేందుకు తమకు హక్కు ఉందనే తీరు ఇప్పటి యువతలో అధికంగా కనిపిస్తోందని చెప్పారు. అరచేతిలో అంతర్జాల సౌలభ్యంతో నీలిచిత్రాలు .. డేటింగ్‌యాప్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఒంటరిగా ఉన్నామనే ఆలోచన నుంచి బయటపడేందుకు జంటను కోరుకునే అమ్మాయిలు/అబ్బాయిలు అధికమవుతున్నారు. ఈ పరిణామాలు తెలిసీ తెలియని వయసులో శారీరకంగా ఒక్కటవటం వంటి వాటికి దారి తీస్తున్నాయి. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకొని.. పోలీసుల వద్దకు వస్తున్న 80-90 శాతం జంటలు… పెళ్లికి ముందే తాము ఒక్కటయ్యామంటూ చెబుతుండటం పరిస్థితి ఎంతగా చేయి దాటి పోయిందో వెల్లడిస్తోంది. మంచి చెడుల విచక్షణ తెలియ జెప్పటంతోపాటు కుటుంబ విలువలను పిల్లలకు చెప్పడం ద్వారా వారిలో మార్పు తీసుకురావచ్చంటున్నారు డాక్టర్‌ హరీష్‌రెడ్డి. ప్రేమ వ్యవహారాలను గుర్తించినప్పుడు వాటి పర్యవసనాలు వివరించటం, జీవితంలో స్థిరపడ్డాక ఒక్కటి చేస్తామనే నమ్మకం కల్పించటం ద్వారా యువతలో మార్పు తీసుకురావచ్చని అభిప్రాయం వెలిబుచ్చారు

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *