Home / Guntur / అదిగో.. అమరావతి

అదిగో.. అమరావతి

ఐదు కోట్ల మంది ఆంధ్రులు సగర్వంగా చెప్పుకొనేలా రాజధాని అమరావతిని నిర్మించేందుకు నాలుగేళ్లకుపైగా తాము పడుతున్న శ్రమ, తపన ప్రస్తుతం పలు నిర్మాణాల రూపంలో స్పష్టంగా కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచంలోని అత్యుత్తుమ రాజధాని నగరాల్లో ఒకటిగా దీనిని రూపుదిద్దేందుకు చేపట్టిన పనులు సంతృప్తికరంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రానున్న 3 నెలల్లో ఇందులోని రహదారులు, భవనాలు, మౌలిక వసతులు, ఎల్పీఎస్‌ జోన్ల అభివృద్ధి పనులన్నీ మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తాయని తెలిపారు. రాజధానిలో ప్రాధాన్య రహదారులు, గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో నిర్మితమవుతున్న గృహ సముదాయాలు, జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌, సచివాలయ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు ఇత్యాది నిర్మాణాలను బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 7 గంటల వరకు ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. కొద్ది నెలల క్రితం తొలిసారి క్షేత్ర పర్యటన జరిపిన సంగతి తెలిసిందే.
ఇది రెండోసారి. పర్యటన ఆసాంతం ముఖ్యమంత్రి హుషారుగా కనిపించారు. ఆయా నిర్మాణాల తీరుపై ఆయన ముఖంలో సంతృప్తి కనపడింది. అనంతరం జీఏడీ టవర్‌ నిర్మాణ ప్రదేశంలో సీఎం విలేకరులతో మాట్లాడారు. రాజధాని నగర విశిష్టతలు, దానిని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి, తద్వారా రాష్ట్రానికి, ప్రజలకు ఒనగూరబోయే ప్రయోజనాల గురించి వివరించారు. ఈ సందర్భంగా కేంద్రం, ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు కూడా సంధించారు. ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘అమరావతి అంతటి సువిశాల ప్రదేశంలో, పూర్తి గ్రీన్‌ఫీల్డ్‌ సిటీగా, అత్యంత భారీ ఎత్తున, అత్యుత్తమంగా నిర్మితమవుతున్న నగరం ప్రస్తుతం ప్రపంచంలోనే లేదు. ఇందులో నిర్మించే ఐకానిక్‌ నిర్మాణాలు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్లు, కృష్ణానదిపై వంతెనలు, 8, 6 వరుసల సువిశాల రహదారులు, వందలాది ఎకరాల్లో పచ్చదనం, ల్యాండ్‌స్కేపింగ్‌, రోడ్ల పక్కన వేలాది మొక్కలు, భారీ ఉద్యానవనాలు చూసి మన రాజధానిని యావత్ప్రపంచం కీర్తిస్తుంది.
గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ మధ్యలో, సుమారు 7 కిలోమీటర్ల పొడవున దాదాపు 600 ఎకరాల్లో రానున్న ల్యాండ్‌స్కేపింగ్‌, సమున్నతంగా నిర్మితమయ్యే అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్‌ టవర్లు, 320 కిలోమీటర్ల పొడవైన వంకర లేని రోడ్లు, నీరు-డ్రైనేజీ- గ్యాస్‌- విద్యుత్‌- ఐటీ తదితర సకల మౌలిక వసతులూ.. భూగర్భంగుండానే సాగేలా రోడ్ల పక్కల ఏర్పాటు చేస్తున్న డక్ట్‌లు.. మరే నగరానికీ లేని ప్రత్యేకతలు. ఇందులోని ప్రతి నిర్మాణంపైనా సౌరవిద్యుత్‌ ఫలకాల అమరికతో వాటికి అవసరమయ్యే విద్యుత్‌లో కనీసం 33 శాతం అక్కడే ఉత్పత్తయ్యేలా చూస్తాం. నగరంలో పెద్దఎత్తున ఎలక్ట్రికల్‌ వాహనాలను ప్రవేశపెడతాం. నిరుపేదలు సైతం నాణ్యమైన, సౌకర్యవంతమైన జీవనం గడిపేందుకు అవసరమైన అన్ని వనరులతో అమరావతి రూపుదిద్దుకోనుంది. 9 థీమ్‌ సిటీలు, 27 టౌన్‌ షిప్‌లతో దేనికీ రాజధాని వెలుపలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్నీ వాటిల్లోనే ఏర్పడేలా చూడడం మరో ప్రత్యేకత’.
కొందరు తప్పనిసరై ఉంటున్నారు..
‘ప్రస్తుతం కొందరు అమరావతికి స్వచ్ఛందంగా వచ్చినప్పటికీ ఇంకొందరు మాత్రం తప్పనిసరై ఇక్కడ ఉంటున్నారు. అయితే కొద్ది సంవత్సరాల్లోనే ఇక్కడ ఉండకపోతే పశ్చాత్తాపపడాల్సిన పరిస్థితి వస్తుంది. హైకోర్టు తాత్కాలిక నిర్వహణ నిమిత్తం 2,53,000 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ వచ్చే నెల 15కల్లా పూర్తవుతుంది. జనవరి 1నాటికి హైకోర్టు నిర్వహణకు వీలుగా సిద్ధమవుతుంది. నవ్యాంధ్ర హైకోర్టు ప్రారంభ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆహ్వానించబోతున్నాం. ఇందులో 19 కోర్టులు ఉంటాయి. ఇది పూర్తయిన 3, 4 నెలలకే వివిధ కేటగిరీల అధికారులు, ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న 3,840 ఫ్లాట్లు సిద్ధమవుతాయి. శాశ్వత హైకోర్టుతో కూడిన జస్టిస్‌ సిటీని పూర్తి హంగులతో నిర్మిస్తాం.’
 
ముఖ్యమంత్రి పర్యటన కొనసాగిందిలా..
  • మధ్యాహ్నం 3.30కి ఉండవల్లిలోని తమ నివాసం నుంచి బయల్దేరిన సీఎం తొలుత ఉద్దండరాయునిపాలెం నుంచి నిడమర్రు వరకు నిర్మితమవుతున్న ఎన్‌-9 కీలక రహదారిని పరిశీలించారు. వివిధ ప్రాధాన్య రహదారులు కలుసుకునే జంక్షన్లను తిలకించి అధికారులకు సూచనలిచ్చారు.
  • తర్వాత రాయపూడి, నేలపాడు వద్ద అఖిల భారత సర్వీస్‌ అధికారులు(ఏఐఎస్‌), గెజిటెడ్‌, ఎన్జీవోలు, 4వ తరగతి ఉద్యోగులకు ఉద్దేశించిన కొన్ని టవర్ల పరిశీలించారు.
  • 12 అంతస్థులు పూర్తయిన టవర్‌ను చూసి వచ్చి.. బస్సెక్కబోయే ముందు మళ్లీ వెనక్కి తిరిగి పరిశీలన.. నిర్మాణంపై సంతృప్తి.
  • అసెంబ్లీ, శాశ్వత హైకోర్టుల నిర్మాణ ప్రదేశాల పరిశీలన. జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌, సెక్రటేరియట్‌ టవర్ల పనుల పురోగతిపై అధికారుల, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధుల వద్ద వాకబు. వివిధ ప్రాజెక్టు ప్రదేశాల వద్ద ఫొటో ఎగ్జిబిషన్ల సందర్శన.

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *