Home / News / నందమూరి కుటుంబానికి అచ్చిరాని నల్లగొండ ప్రయాణం

నందమూరి కుటుంబానికి అచ్చిరాని నల్లగొండ ప్రయాణం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రయాణాలు నందమూరి కుటుంబానికి కలిసి రావడం లేదు. 2009 ఎన్నికల సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ టీడీపీ తరఫున ప్రచారం నిర్వహించారు. గుడివాడలో ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌ వెళ్తుండగా.. సూర్యాపేట జిల్లా పరిధిలోని మోతె మండల కేంద్రంలో ఒక మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జూనియర్‌ ఎన్టీఆర్‌తోపాటు అందులో ప్రయాణిస్తున్న ఆయన మిత్రులు స్వల్పగాయాలపాలయ్యారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాలేదు. ఇక, 2014లో జానకిరామ్‌ కూడా నల్లగొండ జిల్లా కోదాడ సమీపంలోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బుధవారం హరికృష్ణ సైతం అదే జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం గమనార్హం.
ఆ ముగ్గురు..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుది పెద్ద కుటుంబం. ఆయనకు ఎనిమిది మంది కుమారులు, నలుగురు కుమార్తెలు. ఇందులో రామకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ మరణించారు. అందరికంటే ముందు బాగా చిన్న వయసులోనే రామకృష్ణ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన పేరుతోనే ఎన్టీఆర్‌ హైదరాబాద్‌లో ‘రామకృష్ణ హార్టికల్చరల్‌ స్టూడియో’ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరో కుమారుడికి ‘రామకృష్ణ’ అనే పేరు పెట్టారు. ఇక… సుమారు పదేళ్ల కిందట సాయికృష్ణ అనారోగ్యంతో మరణించారు. ఆయనకు చిన్ననాటి నుంచి అస్తమా వంటి సమస్య ఉండేదని అంటారు. సాయికృష్ణ రెండేళ్లు ఆస్పత్రిలో కోమాలో ఉండి మరణించారు. హరికృష్ణకన్నా సాయికృష్ణ పెద్దవాడు. ఇప్పుడు తాజా ప్రమాదంలో హరికృష్ణ దుర్మరణం పాలయ్యారు. 11 మంది సంతానంలో హరికృష్ణ ఐదోవారు. ఆయనకు ముగ్గురు అన్నలు, ఒక అక్కయ్య ఉన్నారు.
అందరి క్షేమం కోరుకునే ఇంటనే..
హరికృష్ణ తనయుడు జానకిరామ్‌ రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత ఆయన కుటుంబం ‘నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌’ పతాకంపై తీస్తున్న చిత్రాల ప్రదర్శనకు ముందు ఇస్తున్న సందేశమిది. ఈ సందేశం అనంతరం జానకిరామ్‌ చిత్రం కనిపిస్తుంది. ఆ తర్వాతే సినిమా మొదలవుతుంది. ఇప్పుడా ఇంటి పెద్దనే రోడ్డు ప్రమాదం బలిగొనడం విషాదం.

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *