Home / News / ముకేశ్‌ మ్యాజిక్‌!

ముకేశ్‌ మ్యాజిక్‌!

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ స్థానం దక్కింది. గత ఏడాది (19వ స్థానం)తో పోలిస్తే అంబానీ మరో ఆరు స్థానాలు ఎగబాకారు. 2017తో (33వ స్థానం) పోలిస్తే ఏకంగా 20 స్థానాలు అధిగమించారు. 2018లో 4,010 కోట్ల డాలర్లుగా నమోదైన ఆయన సంపద.. 2019లో 5,000 కోట్ల డాలర్లకు పెరిగింది. ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) దేశం లోని అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటి. ఈ ఏడాదికి విడుదలైన ఫోర్బ్స్‌ వరల్డ్‌ రిచ్‌ లిస్ట్‌లో భారత్‌ నుంచి 160 మందికి చోటు దక్కగా.. అందులో అంబానీదే ప్రథమ స్థానం. విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ 2,260 కోట్ల డాలర్ల ఆస్తితో ప్రపంచ జాబితాలో 36వ స్థానంలో నిలిచారు. హెచ్‌సీఎల్‌ సహ వ్యవస్థాపకుడు శివ్‌ నాడార్‌ 82, ఆర్సెలార్‌ మిట్టల్‌ చైర్మన్‌, సీఈఓ లక్ష్మీ నివాస్‌ మిట్టల్‌ 91వ స్థానంలో ఉన్నారు. అంటే, టాప్‌-100లో భారత్‌ నుంచి నలుగురికి మాత్రమే చోటు దక్కింది. ఈ జాబితాలో చోటు లభించిన భారతీయుల్లో ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా (122వ స్థానం), అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ (167), భారతీ ఎయిర్‌టెల్‌ అధిపతి సునీల్‌ మిట్టల్‌ (244), పతంజలి ఆయుర్వేద సహ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ (365), పిరామల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ అజయ్‌ పిరామల్‌ (436), బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ మజుందార్‌ షా (617), ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి (962), రిలయన్స్‌ కమ్యూ నికేషన్స్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ (1,349వ స్థానం) కూడా ఉన్నారు.
మళ్లీ బెజోస్‌ నం.1
అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు ప్రపంచ సంపన్నుల జాబి తాలో మరోసారి నంబర్‌ వన్‌ స్థానం లభించింది. 55 ఏళ్ల బెజోస్‌ సంపద 13,100 కోట్ల డాలర్లకు చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే 1,900 కోట్ల డాలర్లు పెరిగింది. ఇక మైక్రోసాఫ్ట్‌ అధిపతి బిల్‌గేట్స్‌ 9,650 కోట్ల డాలర్ల ఆస్తితో రెండో స్థానంలో నిలవగా.. స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గురువు, బెర్క్‌షైర్‌ హాత్‌వే చైర్మన్‌ వారెన్‌ బఫెట్‌ 8,250 కోట్ల డాలర్ల సంపదతో మూడో స్థానంలో ఉన్నారు. ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకెర్‌బర్గ్‌ ర్యాంకింగ్‌ గత ఏడాదితో పోలిస్తే 3 స్థానాలు జారి 8వ స్థానానికి పరిమితమైంది. న్యూయార్క్‌ మాజీ మేయర్‌ మైకేల్‌ బ్లూమ్‌బర్గ్‌ ర్యాంకింగ్‌ రెండు స్థానాలు పెరగడంతో 9వ స్థానానికి చేరుకున్నారు.
అందరి ఆస్తి 8.7 లక్షల కోట్ల డాలర్లు
ఫిబ్రవరి నెల 8 వ తేదీన స్టాక్‌ మార్కెట్లో కుబేరులకు చెందిన కంపెనీల షేర్ల ధరలతోపాటు మారకం రేట్ల ఆధారంగా ఈ జాబితాను రూపొందించడం జరిగిందని ఫోర్బ్స్‌ వెల్లడించడం జరిగింది. ఫోర్బ్స్‌ ఈ లిస్ట్‌ విడుదల చేయడం ఇది 33వసారి. 2018లో 2,208 మందికి చోటు లభించగా.. ఈసారి 2,153 మంది సంపన్నులకు స్థానం దక్కింది. ఈ ఏడాది జాబితాలోని కుబేరులందరి ఆస్తి కలిపితే 8.7 లక్షల కోట్ల డాలర్లు. గత ఏడాది ఈ విలువ 9.1 లక్షల కోట్ల డాలర్లు. 2016 తర్వాత కుబేరులు, వారి ఆస్తి తగ్గడం మళ్లీ ఇదే మొదటిసారి కాగా.. దశాబ్ద కాలంలో ఇది రెండోసారి.

About admin

Check Also

అదిగో.. అమరావతి

ఐదు కోట్ల మంది ఆంధ్రులు సగర్వంగా చెప్పుకొనేలా రాజధాని అమరావతిని నిర్మించేందుకు నాలుగేళ్లకుపైగా తాము పడుతున్న శ్రమ, తపన ప్రస్తుతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *