Home / News / అత్తాపూర్ ఘటనలో పోలీసుల తీరుపై నెటిజన్ల విమర్శలు

అత్తాపూర్ ఘటనలో పోలీసుల తీరుపై నెటిజన్ల విమర్శలు

సంచలనం రేపిన అత్తాపూర్ హత్య కేసు ఘటనలో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హత్య జరిగిన సమయంలో పోలీసు వాహనం ఎదురుగానే ఉండటంతో పోలీసుల తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పట్టపగలు నడిరోడ్డుపై హంతకుడు అంత దారుణానికి పాల్పడుతుంటే పోలీసులు వాహనంలో ఉండి సినిమా చూస్తున్నారా అని ఓ నెటిజన్ ప్రశ్నిస్తే, హైదరాబాద్‌లో శాంతిభద్రతలు ఎక్కడున్నాయని మరో నెటిజన్ ప్రశ్నించాడు. హత్య జరిగిన అనంతరం హంతకుడు.. చనిపోయిన అతని చుట్టూ తిరిగి ఏదో ఘన కార్యం చేసినట్టు ఫోజ్ కొడుతున్నా.. అక్కడున్న పోలీసు వాహనం చూసీచూడనట్టు వెళ్లిపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హంతకుడిని చూసి కూడా అక్కడ నుంచి పోలీసు వాహనం ఎందుకు వెళ్లిపోయిందని డీసీపీ ప్రకాష్ రెడ్డిని ప్రశ్నించగా.. ఘటన వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని.. దాన్ని క్లియర్ చేసే నిమిత్తం పోలీసులు ఆ వాహనంలో అక్కడ నుంచి వెళ్లారని చెప్పారు. పోలీసులు వాహనంలో ఉండి కూడా ఎందుకు కాపాడలేదని అడగ్గా.. ఘటనకు సంబంధించిన వీడియోలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
హత్య జరిగిన తీరు ఇది..
 నగరంలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అత్తాపూర్‌ పిల్లర్‌ నెం.145 దగ్గర ఓ యువకుడిని గొడ్డలితో నరికి చంపాడో వ్యక్తి. దాదాపు 100 మీటర్ల దూరం వరకు వెంటాడి వేటాడి అతికిరాతకంగా హత్య చేశాడు. ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు అక్కడే ఉన్నా.. పోలీసు వాహనం ముందే ఈ దారుణం జరగడం విచారకరం. తనను రక్షించాలంటూ ఆ యువకుడు ఆర్తనాదాలు పెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. అక్కడున్న వారు రక్షించేందుకు ప్రయత్నించినా.. అవతలి వ్యక్తి చేతిలో గొడ్డలి ఉండడంతో భయపడుతూ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దాడి చేసినవారిలో ఇద్దరిని ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నారు. ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *