Home / News / ‘ఆధార్‌’ కొన్నింటికే!

‘ఆధార్‌’ కొన్నింటికే!

 • అది చట్టబద్ధం, రాజ్యాంగానికి లోబడే ఉంది
 • వ్యక్తిగత గోప్యతకు భంగమేమీ కాదు
 • వివరాలు ప్రైవేటు సంస్థలకు ఇవ్వొద్దు
 • సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు
 • సమాచార భద్రతకు పటిష్ఠ వ్యవస్థ కావాలి
 • అక్రమ వలసదారులకు ఆధార్‌ దక్కనివ్వొద్దు
 • సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ
 • ధర్మాసనంలో 4-1 సభ్యుల మెజారిటీ తీర్పు
 • జస్టిస్‌ చంద్రచూడ్‌ భిన్నమైన తీర్పు
‘ఆధార్‌’ అవసరం
 • ఆదాయపు పన్ను రిటర్న్స్‌
 • దాఖలుకు ఆధార్‌ కావాలి.
 • ‘పాన్‌’కు ఆధార్‌ తప్పనిసరి.
 • సంక్షేమ పథకాల లబ్ధి, రాయితీలు పొందాలంటే ఆధార్‌ తప్పదు.
‘ఆధార్‌’ అనవసరం
 • మొబైల్‌ ఫోన్‌ నంబర్లతో ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి కాదు.
 • బ్యాంకు ఖాతా తెరిచేందుకు, బ్యాంకు నుంచి ఇతర సేవలు పొందేందుకు ఆధార్‌
 • ఉండాల్సిన అవసరం లేదు.
 • ‘ఆధార్‌’ లేదంటూ పిల్లలకు వారి ప్రయోజనాలను దూరం చేయరాదు. అంటే… బడిలో ప్రవేశాలకు ఆధార్‌ అవసరం లేదు.
 • సీబీఎ్‌సఈ, నీట్‌, యూజీసీ నిర్వహించే ప్రవేశ పరీక్షలకు ఆధార్‌ను తప్పనిసరి చేయరాదు
 • ఆధార్‌ చట్టబద్ధమే! రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుంది. కానీ… ప్రతి చిన్నదానికీ, చిల్లర అవసరాలకూ ఆధార్‌ అక్కర్లేదు! ప్రభుత్వం నుంచి రాయితీలు, సంక్షేమ పథకాల ఫలాలు పొందాలనుకుంటే ఆధార్‌ కావాలి. ఆదాయపు పన్ను రిటర్న్స్‌ దాఖలుకు, పాన్‌కార్డుకు మాత్రమే ఆధార్‌ కావాలి. అంతే! అంతకుమించి ఏ అవసరానికీ ఆధార్‌ అక్కర్లేదు! ‘ఆధార్‌’పై సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక, సంచలన తీర్పు ఇది! బడిలో ఆధార్‌, బ్యాంకులో ఆధార్‌, ఫోన్‌కు ఆధార్‌, రైలు ప్రయాణానికి ఆధార్‌, పుట్టగానే ఆధార్‌, చావుకూ ఆధార్‌… భారతీయుల జీవితంలో కొన్నేళ్లుగా ‘ఆధార్‌’ విడదీయరాని భాగంగా మారింది. ఈ నేపథ్యంలో ఆధార్‌ చట్టబద్ధతను సవాలు చేస్తూ గత ఆరేళ్లలో మొత్తం 31 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై 38 రోజులపాటు విచారణ జరిపిన చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం మంగళవారం సంచలన తీర్పు చెప్పింది.
ఆధార్‌ దేనికి అవసరమో స్పష్టంగా వివరించింది. చీఫ్‌ జస్టి్‌సతో పాటు జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌ తరఫున జస్టిస్‌ ఏకే సిక్రీ 567 పేజీల తీర్పు రాయగా… ఇదే తీర్పుతో ఏకీభవిస్తూ జస్టిస్‌ అశోక్‌భాన్‌ విడిగా తీర్పు లిఖించారు. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ మాత్రం మెజారిటీ తీర్పునకు భిన్నంగా స్పందించారు. ధర్మాసనం మెజారిటీ తీర్పు ప్రకారం… ఆదాయపు పన్ను రిటర్న్స్‌ దాఖలు చేసే వారందరికీ ఆధార్‌ తప్పనిసరిగా ఉండాలి. అలాగే… ‘శాశ్వత ఖాతా సంఖ్య’ (పాన్‌)కు కూడా ఆధార్‌ తప్పదు. అత్యంత కీలకమైన, అందరిపైనా ప్రభావం చూపించే సంక్షేమ పథకాలు, సబ్సిడీలు పొందేందుకు కూడా ఆధార్‌తో అనుసంధానం కావాల్సిందే. అంతేతప్ప… మొబైల్‌ ఫోన్లకు, బడిలో ప్రవేశాలకు, నీట్‌ పరీక్షకు, యూజీసీ లేదా సీబీఎ్‌సఈ నిర్వహించే ఇతరత్రా పరీక్షల్లో దేనికీ ఆధార్‌ తప్పనిసరి కాదు. అన్నింటికీ మించి బ్యాంకులో ఖాతా తెరిచేందుకు కూడా ఆధార్‌ తప్పనిసరి కాదు. వెరసి… ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిఫలం అక్కర్లేదనుకునే, ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయాల్సిన అవసరం లేని వారెవరూ ఆధార్‌ తీసుకోనక్కర్లేదు.
గోప్యంగా ఉంచాల్సిందే…
ఆధార్‌ చట్టబద్ధతను, దీనిని మనీ బిల్లుగా లోక్‌సభలో ఆమోదించడాన్ని ధర్మాసనం సమర్థించింది. ఇది సమాజంలోని బలహీనవర్గాలకు సాధికారత గుర్తింపును ఇస్తుందని అభిప్రాయపడింది. ఒకే వ్యక్తి రెండు ఆధార్‌ కార్డులు తీసుకునే అవకాశం లేకుండా సరైన జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపింది. అయితే… ‘దేశ భద్రత’ పేరిట ఆధార్‌లోని పౌరుల వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకునేందుకు వీలు కల్పించే ఆధార్‌ చట్టంలోని 57వ నిబంధనను కోర్టు కొట్టివేసింది. ఆధార్‌ వివరాలను టెలికం సంస్థల వంటి ప్రైవేటు కంపెనీలు, ఇతర కార్పొరేట్‌ కంపెనీలకు అందుబాటులో ఉంచకూడదని స్పష్టం చేసింది. ఆధార్‌ అథెంటికేషన్‌ డేటాను ఆరు నెలలకు మించి ఉంచరాదని తెలిపింది.
ఆధార్‌ వ్యక్తిగత గోప్యత హక్కు (రైట్‌ టు ప్రైవసీ)ను ఉల్లంఘిస్తోందనే వాదనను తోసిపుచ్చింది. ఇతర గుర్తింపు కార్డుల కోసం కూడా పౌరులు ఇలాంటి సమాచారాన్ని అందిస్తున్నారని గుర్తు చేసింది. ఆధార్‌ కోసం భారత విశిష్ట గుర్తింపు సంస్థ (యూఐడీఏఐ) బయోమెట్రిక్‌తోపాటు కనీస వివరాలను మాత్రమే సేకరిస్తోందని పేర్కొంది. అయితే… ఆధార్‌ సమాచారం భద్రంగా ఉండేలా బలమైన వ్యవస్థను సాధ్యమైనంత త్వరగా ప్రవేశపెట్టాలని ఆదేశించింది. అలాగే… అక్రమ వలసదారులకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆధార్‌ గుర్తింపు మంజూరు చేయవద్దని స్పష్టం చేసింది.
అర్థం.. పరమార్థం..
‘ఆధార్‌’ అనే పదానికి నిఘంటువు చెబుతున్న అర్థమేదైనా… ఇది ప్రతి ఒక్కరి ఇంటిపేరుగా మారింది. దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాపించింది. బలహీన వర్గాలకు ఇదొక సామాజిక గుర్తింపుగా మారింది. ‘డిజిటల్‌ ఎకానమీ’కి చిహ్నంగా నిలిచింది. అయితే… ఏదైనా విశిష్ఠంగా (యూనిక్‌) ఉండటంకంటే ఉత్తమంగా (బెస్ట్‌) ఉండటం మంచిది. ఉత్తమంగా ఉంటే మనమే నెంబర్‌ వన్‌. ‘యూనిక్‌’ అంటే ఒంటరిగా ఉండటం!
ప్రభావితం కాలేదు
ఆధార్‌ చెల్లుబాటుపై కోర్టు వెలుపల తీవ్రస్థాయిలో వాడీవేడి చర్చలు జరిగాయి. ఈ అంశంపై సామాన్యులతోపాటు మేధావులు రెండుగా విడిపోయారు. ఆధార్‌ను సమర్థిస్తూ, వ్యతిరేకిస్తూ పెద్దసంఖ్యలో వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఇంటర్వ్యూలు వచ్చాయి. ఆధార్‌కు అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రశంసలు వచ్చాయని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వాదించారు. వీటిలో దేనికీ మేం ప్రభావితులం కాకుండా తీర్పు చెబుతున్నాం.
నిఘా ఏముంది!
ఇప్పుడు దేశం నలుమూలలా ఆమోదిస్తున్న గుర్తింపు ‘ఆధార్‌’. ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధమైనది, చట్టబద్ధమైనది. సమాజంలో ప్రతి ఒకరూ తమ పేరు, ఊరు, వయసు, చిరునామా వంటి ఆధారాలను తమ గుర్తింపు కోసం చెబుతూనే ఉంటారు. ఇక… ఆధార్‌లో ఫొటో, వేలిముద్రలు, ఐరిస్‌ స్కాన్‌ వంటి శరీర ప్రాథమిక చిహ్నాలను మాత్రమే రికార్డు చేస్తున్నారు. ఇది నిఘా వేయడం కాదు. వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించడమూ కాదు.

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *