Home / News / భారత్ గురించి కసబ్ ఏమన్నాడో తెలిపిన విశ్రాంత పోలీసు అధికారి

భారత్ గురించి కసబ్ ఏమన్నాడో తెలిపిన విశ్రాంత పోలీసు అధికారి

మీరు గెలిచారు.. నేను ఓడాను.. లష్కరే తాయిబా ఉగ్రవాది, 2008లో ముంబైలో విధ్వంసం సృష్టించిన నరహంతకుడు.. అజ్మల్‌ అమీర్‌ కసబ్‌ ఆఖరు మాటలివి! 2012 నవంబరు 21న అతణ్ని ఉరి తీయడానికి ఒక్కరోజు ముందు నాటి సీనియర్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌ మహాలేతో అతడు ఈ మాటలన్నాడు. 2008 నవంబరు 26న ముంబై మీద దాడి చేసి దొరికిపోయిన కసబ్‌ను మహాలే తొలిసారి నాయిర్‌ హాస్పిటల్‌లో ప్రశ్నించారు. ఆ కేసును దర్యాప్తు చేసిన ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ యూనిట్‌-1 ప్రధాన విచారణాధికారి ఆయనే. 2012లో కసబ్‌ను ఉరితీయగా.. 2013లో మహాలే రిటైర్‌ అయ్యారు.
ఆరేళ్ల తర్వాత ఇప్పుడు ఆ జ్ఞాపకాలను ఆయన నెమరు వేసుకున్నారు. సాధారణంగా నేరగాళ్లతో నిజం చెప్పించడానికి వాడే కఠినమైన ఇంటరాగేషన్‌ పద్ధతులు కసబ్‌ విషయంలో పనికిరావని తమకు త్వరగానే అర్థమైందని ఆయన వివరించారు. అతడు సౌకర్యవంతంగా ఉండేలా చేసి.. తనంత తానే నోరు విప్పేదాకా వేచిచూశాం అని వెల్లడించారు. ఇందుకోసం తాను రెండు జతల దుస్తులు కూడా కొనిచ్చినట్టు చెప్పారు. దాదాపు నెలన్నరపాటు అతడు మా అదుపులో ఉన్న తర్వాత అతడి ఆలోచనాధోరణిని అర్థం చేసుకొనే అవకాశం వచ్చిందని చెప్పారు. తనకు ఉరిశిక్ష విధించినా, భారత్‌లో అది అమలయ్యే అవకాశం లేదని అతడు చెప్పాడని.. అఫ్జల్‌గురు ఉదంతాన్ని అందుకు ఉదాహరణగా చూపాడని వివరించారు.
 Image result for kasab
అమితాబ్‌ ఇంటిముందుంటే..
కసబ్‌ ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం చెప్పేవాడు కాదని మహాలే వివరించారు. కోర్టులో కసబ్‌ వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ప్రయత్నించగా.. తాను పాకిస్థానీనని, అమితాబ్‌ను చూడాలనే ఆశతో చెల్లుబాటయ్యే వీసాతోనే భారత్‌కు వచ్చానని.. బచ్చన్ల జుహూ బంగ్లా బయట వేచి ఉండగా రా అధికారులు ఉన్నట్టుండి వచ్చి తనను అదుపులోకి తీసుకుని, ముంబై పోలీసులకు అప్పగించారని చెప్పాడట. పోలీసులు తనను చేతిపై కాల్చి లాకప్‌లో పెట్టారని.. నాలుగు రోజుల తర్వాత తనపై 26/11 కేసులో ఇరికించారని చెప్పాడట.
చివరి క్షణాలు..
2012 నవంబరు 12న కోర్టు కసబ్‌కు ఉరిశిక్ష విధించింది. అతణ్ని పుణెలోని ఎరవాడ జైలుకు తరలించే టీమ్‌లో మహాలే కూడా ఉన్నారు. నవంబరు 19న అర్ధరాత్రి.. కసబ్‌ను అతడి సెల్‌ నుంచి బయటకు తేవడానికి మహాలే వెళ్లారు. భారతదేశంలో ఉరిశిక్షపై గతంలో కసబ్‌ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసిన మహాలే.. ‘నువ్వు అన్న మాటలు నీకు గుర్తున్నాయా? (ఆ మాటలు అని) నాలుగేళ్లు కూడా కాలేదు. నీకు మిగిలింది ఇంకా వారం రోజులే’ అన్నారు. అప్పుడు కసబ్‌ ‘మీరు గెలిచారు, నేను ఓడాను’ అన్నాడు. అక్కడి నుంచి పుణెలోని ఎరవాడ జైలుకు వెళ్లిన మూడున్నర గంటల్లో అతడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతడిలో అంతకుముందున్న అతిశయం, ఆత్మవిశ్వాసం స్థానంలో చావు భయం వచ్చి చేరింది అని వివరించారు. కసబ్‌ను ఉరితీశారన్న వార్త విన్న క్షణం తన జీవితంలోనే అత్యంత ఆనందం కలిగించిన క్షణమని చెప్పారు.

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *