Home / News / వీళ్లూ మనుషులా..?!

వీళ్లూ మనుషులా..?!

అతనో రిటైర్డ్‌ ఉద్యోగి.. పింఛన్‌ డబ్బులో కొంత పిల్లలకు పంచి, మిగతాది తన వద్దే పెట్టుకున్నాడు. ఆ మిగతా డబ్బు కోసం పిల్లలు నిత్యం తండ్రితో గొడవ పడేవారు. ఈ క్రమంలో ఆయనను తీవ్రంగా కొట్టడంతో రక్తస్రావం జరిగి తుది శ్వాస విడిచాడు. మీర్‌పేట పోలీసు స్టేషన్‌ పరిధిలోని జిల్లెలగూడ పాత గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
జిల్లెలగూడకు చెందిన మేడిపల్లి కృష్ణ(58) వాటర్‌వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌లో అటెండర్‌గా పని చేసి ఈ ఏడాది జూన్‌లో పదవీ విరమణ పొందారు. ఆయనకు ఐదుగురు కూతుళ్లు, ఒక కొడుకు. కాగా.. ముగ్గురు కూతుళ్లకు వివాహమయింది. మిగతా ముగ్గురూ ఇంటి వద్దే ఉంటున్నారు. రిటైర్మెంట్‌ సమయంలో కృష్ణకు రూ.6లక్షలు పింఛన్‌ డబ్బు వచ్చింది. అనంతరం ఓ ప్లాటు అమ్మగా మరో రూ.10లక్షలు కూడా వచ్చాయి. ఈ మొత్తం డబ్బు కోసం కూతుళ్లు, కొడుకు నిత్యం వేధించేవారు. దాంతో ఆయన ఇటీవల పది లక్షలు అందరికీ పంచేశాడు. పింఛన్‌ డబ్బు కూడా కావాలని కొడుకు తరుణ్‌(23) ఆయనను గతంలోనే కొట్టడంతో పీఎస్ లో కేసు పెట్టాడు. ఆ సమయంలో బంధువులు కూర్చుని పింఛన్‌ డబ్బులో రూ.4లక్షలు పిల్లలకు ఇప్పించారు. మిగతా రూ.2లక్షలు ఆయన తన వద్దే ఉంచుకున్నాడు.
వడ్డీలతో బతుకు దెరువు..
వికలాంగుడైన కొడుకు తరుణ్‌తోపాటు పెళ్లికాని ఇద్దరు కూతుళ్లు సైతం ఏ పనీ చేయకుండా ఇంట్లోనే ఉండేవారు. తండ్రి ఇచ్చిన పింఛన్‌ డబ్బును ఇతరులకు ఇచ్చి, దాని ద్వారా వచ్చిన వడ్డీతో బతుకుతున్నారు. ఇదిలా ఉండగా మద్యానికి బానిసైన తండ్రి మిగతా రూ.2లక్షలు తమకు దక్కకుండా చేస్తాడని భావించిన పిల్లలు నిత్యం ఆయనతో గొడవ పడేవారు. ఈ క్రమంలో తరుణ్‌ ఆయనను ఇనుప రాడ్డుతో కొట్టడంతో కాలికి బలమైన గాయమై తీవ్రంగా రక్తస్రావమయింది. దాంతో ఆయన అపస్మారక స్థితికి చేరుకోవడంతో కంగారు పడిన పిల్లలు ఆటోలో స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు అక్కడి వైద్యులు చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మీర్‌పేట పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, తరుణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ, మీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ యాదయ్య తదితరులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
చిన్నారిని చంపిన తండ్రి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో ఘటన
చౌటుప్పల్‌ రూరల్‌: భార్యపై ఇష్టం లేక మూడు నెలల పసిపాపను గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు ఓ తండ్రి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దేవలమ్మ నాగారం గ్రామానికి చెందిన సిలివేరు శివ(25) కుటుంబం ఎల్లగిరిలో నివాసముంటున్నారు. శివకు హైదరాబాద్‌లోని రామంతాపూర్‌కు చెందిన అక్షర అలియాస్‌ స్వప్నతో గత ఏడాది ఆగస్టులో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొన్ని నెలల నుంచి నువ్వంటే ఇష్టం లేదని భార్య అక్షరను శివ వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం వారికి కూతురు నిహారిక జన్మించింది. కూతురు జన్మించిన నాటినుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. ఇంటినుంచి వెళ్లిపోవాలని అనేకసార్లు భార్యను కొట్టాడు. కుటుంబ సభ్యులు, కుల పెద్దలు చెప్పినా శివ పట్టించుకోలేదు.
ఇదిలా ఉండగా.. అక్షర బాత్రూమ్‌కు వెళ్లిన సమయంలో శివ మంచంపై పడుకున్న చిన్నారిగొంతు నులిమాడు. పాప అరుపులకు బయటికి వచ్చిన అక్షర భర్తను నెట్టివేసింది. పాపను చౌటుప్పల్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న అక్షర కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులు శివ ఇంటికి చేరుకున్నారు. పసిపాపను చంపిన తండ్రిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ పాప మృతదేహంతో ఇంటి ఎదుట ఆందోళన నిర్వహించారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు సాయిలు, నవీన్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అక్షర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *