కేంద్ర ప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం విశాఖలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ప్రజలకు మేలు జరుగుతుందనే ఎన్డీయేతో కలిశామని మరోసారి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన కొన్ని చర్యల వల్ల దేశంలో అవినీతి పెరిగిందని బాబు సంచలన ఆరోపణ చేశారు. 40ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వాలతో పోరాడుతూనే ఉన్నామని.. కొన్ని రాష్ట్రాలపై కేంద్రం వివక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్రంలో తాను చాలా ప్రభుత్వాలను చూశాను కానీ.. ఏ ప్రభుత్వంలోనూ ప్రజలు ఇంతగా ఇబ్బంది పడలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించినవారిపై ప్రధాని మోదీ దాడులు చేయిస్తున్నారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ ఏపీకి వచ్చి కూడా తుఫాను ప్రాంతంవైపు చూడనే లేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేరళకు కేంద్రం వరదసాయం ఇవ్వకపోగా యూఏఈ సాయం చేస్తామని ముందుకు వస్తే మోకాలడ్డిందన్నారు. సోలార్ ఎనర్జీ పాలసీపై కేంద్రం సహకరించలేదని.. డిజిటల్ కరెన్సీ మేలని తాను ఏనాడో చెప్పానని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. 500, వెయ్యి నోట్లను రద్దుచేసి 2వేల నోట్లను ప్రవేశపెట్టిందని.. దీంతో అవినీతి మరింత పెరిగిందని కేంద్రంపై తీవ్రస్థాయిలో సీఎం ధ్వజమెత్తారు.