Home / News / రేవంత్‌పై ఐటీ వల

రేవంత్‌పై ఐటీ వల

ఆదాయానికి మించిన ఆస్తులు, మనీ లాండరింగ్‌, పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ఇంటిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, కొడంగల్‌లోని రేవంత్‌ నివాసాలు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లు, బంజారాహిల్స్‌లోని శ్రీసాయి మౌర్య ఎస్టేట్స్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, భూపాల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తదితర వ్యాపార సంస్థల కార్యాలయాలు సహా మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
ఉదయం 8 గంటల నుంచే!!
బెంగళూరు, ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ విభాగంలోని 11 మంది సభ్యుల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల బృందం గురువారం 8 గంటలకే జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి ఇంటికి వచ్చింది. అయితే, రెండు రోజుల కిందట కొడంగల్‌లో ప్రచారం నిర్వహించి, కుటుంబ సభ్యులతోపాటు రేవంత్‌రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లారు. బుధవారం రాత్రి మళ్లీ కొడంగల్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. గురువారం ఉదయం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. భార్య గీత, కుమార్తె నైమిష, సోదరుడు తిరుమల్‌రెడ్డి తదితరులు కూడా ఆయన వెంట కొడంగల్‌లోనే ఉన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఇంట్లో పని మనుషులు తప్ప కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. దాంతో, తాళాలు పగలగొట్టి మరీ అధికారులు లోపలికి ప్రవేశించి సోదాలు చేశారు. అక్కడి నుంచే రేవంత్‌రెడ్డికి సమాచారం అందజేసి పిలిపించుకున్నారు. దాంతో, కోస్గిలో ఎన్నికల ర్యాలీలో ఉన్న రేవంత్‌రెడ్డి హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చారు.
ఆయన వచ్చిన తర్వాత లాకర్లలో ఉన్న మరికొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అమెరికా, మలేషియా, హాంకాంగ్‌ల్లోని రేవంత్‌ రెడ్డి ఆస్తులు, వాటికి సంబంధించిన ఐటీ రిటర్నులను తనిఖీ చేశారు. 2009, 2014 ఎన్నికల సందర్భంగా రేవంత్‌ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లలోని ఆదాయ వివరాలు, ఆస్తుల పెరుగుదల వంటి వివరాలను ఆరా తీశారు. బ్లాక్‌ మనీ, ఆదాయ పన్ను చట్టం 2015; మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం, 2002; ప్రొహిబిషన్‌ ఆఫ్‌ బినామీ ట్రాన్సాక్షన్స్‌ చట్టం 1998; ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ మేనేజ్‌మెంట్‌ (ఫెమా), 1999 కింద రేవంత్‌ రెడ్డిపై కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి మరీ సోదాలు కొనసాగించారు.
ఐటీ సోదాల గురించి తెలిసినా ప్రచారానికి..
ఐదు మండలాల్లో ఎన్నికల ప్రచారానికి గురువారం ఉదయం రేవంత్‌ వెళ్లాల్సి ఉంది. ప్రచారానికి ముందే ఐటీ అధికారులు రేవంత్‌, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారని సమాచారం వచ్చింది. మీడియాలో కథనాలు వచ్చాయి. అయినా, వాటిని లెక్క చేయకుండా కార్యకర్తలకు ఇచ్చిన హామీ మేరకు రేవంత్‌ బొంరాస్ పేట మండలం మదనపల్లి నుంచి ప్రచారం కొనసాగించారు. కానీ, ఐటీ అధికారుల ఆదేశాలతో కోస్గి నుంచే ఆయన హైదరాబాద్‌కు పయనమయ్యారు.
ఐటీ దాడులు రేవంత్‌ కుటుంబ సభ్యులను కలవరానికి గురి చేయగా.. పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమైంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. తనను అరెస్టు చేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ రేవంత్‌ ఆరోపించిన రెండు రోజుల్లోనే ఈ సోదాలు జరగడం సంచలనం రేకెత్తించింది. ఐటీ సోదాల విషయం తెలియగానే జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ ఇంటికి కాంగ్రెస్‌ నేతలు తరలి వచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌ నేత జానారెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, సీతక్క తదితరులు వచ్చి సోదాలను ఖండించారు.
సోదాలకు కారణమదేనా..?
రేవంత్‌రెడ్డి ఇళ్లు, వ్యాపార సంస్థలపై ఐటీ సోదాలు జరగడానికి ఇటీవల న్యాయవాది రామారావు చేసిన ఫిర్యాదే కారణమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్‌ మరో ఎనిమిది మందితో కలిసి ఏర్పాటు చేసిన సంస్థ ద్వారా రూ.200-300 కోట్ల మేర మనీలాండరింగ్‌ జరిగిందని తెలిపారు. రేవంత్‌, తన బంధువుల పేర ఏర్పాటు చేసుకున్న 18 డొల్ల కంపెనీలకు డబ్బు మళ్లించారని వెల్లడించారు. రేవంత్‌రెడ్డి, ఆయన బంధువులపై దర్యాప్తు జరపాలని ఈడీని రామారావు కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే పన్ను ఎగవేతలేమైనా ఉన్నాయా అన్న కోణంలో ఐటీ సోదాలు నిర్వహించినట్లు సమాచారం.

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *