Home / News / రూ.1,700 కోట్లకు టోపీ

రూ.1,700 కోట్లకు టోపీ

హైదరాబాద్‌కు చెందిన విఎంసి సిస్టమ్స్‌ అనే కంపెనీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పిఎన్‌బి) నాయకత్వంలోని బ్యాంకులకు రూ.1,700 కోట్ల మేర టోపీ పెట్టింది. పిఎన్‌బి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) కంపెనీపైనా, కంపెనీ ప్రమోటర్లు ఉప్పలపాటి హిమబిందు, ఉప్పలపాటి వెంకట రామారావు, భాగవతుల వెంకట రమణలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. ఈ కంపెనీకి టెలికాం పరికరాల తయారీ కోసం హైదరాబాద్‌ సమీపంలోని రావిర్యాల దగ్గర ఉత్పత్తి యూనిట్‌ ఉంది. ఈ యూనిట్‌లో తయారయ్యే పరికరాలను కంపెనీ, బిఎ్‌సఎన్‌ఎల్‌తోపాటు వివిధ కంపెనీలకు సరఫరా చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఇప్పటికే విఎంసి సిస్టమ్స్‌ ఆఫీసుతో పాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ సోదాలు చేపట్టింది.
ఇదీ కేసు..
నిర్వహణ మూలధనం కోసమని విఎంసి సిస్టమ్స్‌ కంపెనీ 2009 ఆగస్టు 12న పిఎన్‌బి, ఎస్‌బిఐ, కార్పొరేషన్‌ బ్యాంక్‌, ఆంధ్రా బ్యాంక్‌, జెఎం ఫైనాన్షియస్‌ అసెట్స్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ నుంచి రూ.1,010.50 కోట్లు రుణంగా తీసుకుంది. ఆ రుణాలు చెల్లించడంలో కంపెనీ విఫలమవడంతో బ్యాంకులు ఆరాతీయడం ప్రారంభించాయి. దీంతో తీగలాగితే డొంకంతా కదిలినట్టు కంపెనీ అక్రమాలు బయటపడ్డాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.1,010.50 కోట్ల నిర్వహణ మూలధన రుణాల్లో రూ.43.83 కోట్ల మొత్తాన్ని బ్యాంకుల అనుమతి లేకుండానే ఏప్రిల్‌ 2013-ఏప్రిల్‌ 2014 మధ్య వేరే బ్యాంకుల ఖాతాలకు మళ్లించినట్టు తేలింది. మిగతా నిధులను కూడా ఇలాగే వేరే ఖాతాలకు దారి మళ్లించి ప్రమోటర్లు స్వాహా చేసినట్టు సిబిఐకి పిఎన్‌బి ఫిర్యాదు చేసింది.
వడ్డీతో సహా రూ.1,700 కోట్లు
నిర్వహణ మూలధనం కోసం తీసుకున్న రూ.1,010.50 కోట్ల అప్పు ఇప్పుడు వడ్డీతో కలిపి రూ.1,700 కోట్లు అయింది. ఇందులో రూ.539 కోట్లు పిఎన్‌బికే రావలసి ఉంది. మిగతా రూ.1,207 కోట్లు ఎస్‌బిఐ, కార్పొరేషన్‌ బ్యాంక్‌, ఆంధ్రా బ్యాంక్‌, జెఎం ఫైనాన్షియల్‌ అసెట్స్‌ రీకన్‌స్ట్రక్షన్‌లకు రావలసి ఉంది.
అన్నీ సాకులే
బకాయిలు తీర్చమని బ్యాంకులు ఒత్తిడి చేస్తే విఎంసి సిస్టమ్స్‌ సాకులు చెబుతూ ఇన్నాళ్లూ సాగదీసుకొచ్చింది. బిఎ్‌సఎన్‌ఎల్‌ నుంచే తమకు రూ.262 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్టు చెప్పుకొచ్చింది. అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు బిఎ్‌సఎన్‌ఎల్‌ అధికారులను సంప్రదించగా ఆ కంపెనీకి తాము చెల్లించాల్సింది కేవలం రూ.33.09 కోట్లు మాత్రమేనని చెప్పారు. ఇంకా ఐటిఐ లిమిటెడ్‌, న్యుట్రినో పవర్‌ సిస్టమ్స్‌, వీపీ సిస్టమ్స్‌ అనే కంపెనీల నుంచీ రూ.352.99 కోట్ల వరకు బకాయిలు రావలసి ఉన్నట్టు చెప్పిం ది. ఎస్‌బిఐ అధికారులు దీనిపై ఆరా తీయగా, ఆ కంపెనీల అధికారులూ విఎంసి సిస్టమ్స్‌ వాదనను తోసిపుచ్చారు. దీంతో లీడ్‌ బ్యాంక్‌ అయిన పిఎన్‌బి, సిబిఐకి ఫిర్యాదు చేసింది. బ్యాంకు రుణాలను ప్రమోటర్లు ఏయే ఖాతాలకు మళ్లించారనే దానిపైనా సిబిఐ అధికారులు ఆరా తీస్తున్నారు.

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *