Home / History / అభ్యుదయ వాది ‘బ్రహ్మనాయుడు’

అభ్యుదయ వాది ‘బ్రహ్మనాయుడు’

అభ్యుదయ వాది ‘బ్రహ్మనాయుడు’..
యుద్ధ జయాపజయాలను శాసించ గల మహా యోధుడు..కదన రంగంలో శివతాండవం చేస్తాడు..శత్రువుల పాలిట సింహస్వప్నం..ఈయన కాలు పెడితే యుద్ధ భూమి కంపిస్తుంది..శత్రుసేనలు పరుగులు పెడుతాయి..ఇదంతా ఒక కోణం మాత్రమే..ఆయనలో మరో కోణం దాగి ఉంది.. తరతరాలుగా వేళ్లూనిన ‘కుల వ్యవస్థ’ను పెకిలించాడు..ఆయనే ‘బ్రహ్మ నాయుడు’
1173- 1182 మధ్య కాలంలో ‘పల్నాటి యుద్ధం’ జరిగినట్టు చరిత్రకారుల భావన. ఈ పల్నాటి యుద్ధం మరో కురుక్షేత్ర సంగ్రామంగా ప్రసిద్ధి కెక్కింది. ఈ భీకర యుద్ధంలో ఎందరో వీరులు నేలకొరిగారు. ఎంతో నెత్తురు ఏరులై పారింది. అపార జననష్టాన్ని కల్గించిన ఈ సమరం అశోకుడి కలింగ యుద్ధాన్ని తలపింపజేసింది. ఈ కదనరంగంలో బ్రహ్మ నాయుడు ఉగ్రనరసింహుడిగా మారాడు.
ఎంతోమంది శైర్య ప్రతాపాలకు ప్రతీకలైన వీరులందరిలో పల్నాటి బ్రహ్మన్న మార్గం విశిష్టమైంది, విభిన్నమైంది, వినూత్నమైందని చెప్పవచ్చు. సామాన్యుల రోదనల్లోంచి, ఆవేదనల్లోంచి వీరాధివీరులెందరో పుట్టుకొచ్చారు. గతి తప్పిన సమాజాన్ని సరిదిద్దారు. ప్రజాకంటక దుష్టులపై కొదమసింగాలై కదంతొక్కారు. సంఘాన్ని పట్టి పీడిస్తున్న దురాచార జాడ్యాలపై సంస్కరణోద్యమ అస్త్రాలు సంధించారు. వీరిలో కొందరు చరిత్ర పురుషులైతే మరికొందరు చరిత్ర నిర్మాతలు గా కీర్తికెక్కారు. ఈ మహనీయుల కోవలోకే వస్తాడు పల్నాటి బ్రహ్మనాయుడు. ఈయన ఇచ్చింది శాంతి సందేశం, కోరుకుంది సర్వమానవ సౌభ్రాతృత్వం-సమానత్వం.
తొలి సంఘ సంస్కర్త..సామ్యవాది..
ఆయన అభ్యుదయ భావాలు ప్రజల్లో పెద్ద సంచలనం సృష్టించాయి. సహపంక్తి భోజనాలు అనే సిద్ధాంతంతో బడుగు, బలహీన, నిమ్న వర్గాలను ఉద్ధరించాడు. వర్ణ, వర్గ విభేదాలనే ఉక్కుచట్రాలను వక్కలు చేశాడు. తొలి సంఘ సంస్కర్తగా, సామ్యవాదిగా నిలిచాడు. వీరు అనుసరించింది వైష్ణవం అయినా రాజ్య పాలనలో కుల, మత, వర్గ ప్రభావాలు లేకుండా చూసిన బ్రహ్మనాయుడు అసలు సిసలైన లౌకికవాది. ఆనాడు క్షత్రియులకు, ఉన్నత వర్గాలకే పరిమితమైన అనేక రాజ్య పదవులను ఆయన బడుగులకు కూడా అప్పగించాడని చెప్పడానికి ఇదొక నిదర్శనం. సమాజంలో కరుడగట్టిన, మేటలు వేసిన హెచ్చుతగ్గులను సమం చేసిన సాహసి ఆయన. సర్వమానవ సమానత్వం ఆయన ధ్యేయం. అన్ని వర్గాలతో కలసి చాపకూడు, సహపంక్తి భోజనాలు అనే అభ్యుదయ విధానాలకు శ్రీకారం చుట్టిన సామాజిక విప్లవకారుడాయన. మాలపిల్లలు, కాపు పిల్లలు కలసి చదువుకోవచ్చని 800 ఏళ్ళ క్రితమే ఉద్ఘోషించిన దార్శనికుడు బ్రహ్మన్న. ముందంతా దళిత, బహుజనులదే కాలమని అంచనా కట్టిన అపర బ్రహ్మంగారు ఈ బ్రహ్మనాయుడు. అయితే ఈయన కోరే సర్వ మానవ సౌభ్రాతృత్వం, సమానత్వం నచ్చని ఉన్నత కుల పెద్దలు, వ్యాపార – వాణిజ్య వేత్తలు బ్రహ్మనాయుడుపై తీవ్ర ఆగ్రహానికి, అసంతృప్తికి లోనయ్యారు. వీరు అపర చాణుక్యని వంటి నాగమదేవిని ఈ కారణంగానే తెరపైకి తెచ్చారు. వర్ణ సంకరానికి పాల్పడి సాంప్రదాయాలను, మత వ్యవస్థలను నాశనం చేస్తున్నాడని ఈ వర్గాలు బ్రహ్మనాయుడిపై ఆరోపణలు సంధించారు. కక్ష గట్టారు.


ఆయన జీవిత విశేషాలు..
జగద్విదితమైన పల్నాటి పౌరుషం, శౌర్య ప్రతాపాలకు సముద్రమంత లోతైన, హిమాలయమంత ఎత్తైన చరిత్ర ఉంది. పల్నాటి సీమ ఇప్పటి గుంటూరు జిల్లాలో ఒక తాలూకా. దీని ముఖ్య గ్రామం గురజాల. ఈ సీమ కృష్ణా నదికి దక్షిణ తీరాన సముద్రానికి సుమారు 120 మైళ్ళ దూరంలో ఉంది. ఉత్తర పడమర దిక్కులలో 75 మైళ్ళ పొడవునా కృష్ణానది ప్రవహిస్తుంది. దక్షిణ ప్రాంతమంతా కొండల చేత, దట్టమైన అడవుల చేత ఆవరింపబడి ఉంది. దీని వైశాల్యం దాదాపు 1050 చదరపు మైళ్ళు. నాగులేరు, చంద్రవంక ఈ ప్రాంతంలోని ముఖ్య నదులు.
పల్నాటి రాజ్యం పొందిన అనుగురాజు..
పల్నాటి రాజులకు మూల పురుషుడైన అనుగురాజు హైహయ రాజవంశానికి చెందిన వాడు. మధ్యప్రదేశ్ లోని జబల్ పుర్ ప్రాంతంనుంచి సైన్యంతో తెలుగునాడుకు వలస వచ్చిన ఈయన కార్త వీర్యార్జునుడి సంతతికి చెందిన వాడుగా చరిత్రకారుల భాష్యం. ఈయన ఆంధ్రా, కోస్తా తీరంలోని చందవోలును పాలిస్తున్న వేలంటి చోళునితో తలపడతాడు. ఈ కయ్యం వియ్యంగా మారుతుంది. అనుగురాజు చందవోలు రాకుమారి మైలమ దేవిని వివాహమాడిన కారణంగా పల్నాటి రాజ్యం పొందుతాడు.
మంత్రిగా బ్రహ్మనాయుడు…
అనుగురాజు తెలుగు భాషకు, సంస్కృతి వ్యవహారాలకు కొత్త కావడంతో విజ్ఞుడయిన, అపార అనుభవం ఉన్న దొడ్డనాయుడిని మంత్రిగా నియమిస్తారు. ఈ దొడ్డనాయుడి పెద్ద కుమారుడే బ్రహ్మనాయుడు. అనుగురాజుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య సంతానం నలగామ రాజు, నరసింహ రాజు. రెండవ భార్య సంతానం మలిదేవుడు, ఆయన సోదరులు. అనుగు రాజు మరణించే నాటికి మలిదేవులు చాలా చిన్న వయస్కులు. అనుగురాజు తర్వాత నలగామ రాజు పల్నాడు సీమకు ప్రభువయ్యాడు. ఆయనకు తోడుగా నరసింహరాజు ఉన్నాడు. వీరి పాలనలో కూడా మహామంత్రిగా బ్రహ్మనాయుడే కొనసాగాడు.
విడిపోయిన రాజ్యాలు..
కురువృద్ధుడు భీష్మాచార్యుడి వంటి బ్రహ్మనాయుడు మాచర్ల ప్రభువైన మలిదేవులకు మంత్రిగా, రక్షకుడిగా వెళ్ళాడు. తరతరాలుగా కలసి ఉంటున్న ప్రజల మధ్య రాజ్య విభజన తీరని క్షోభను మిగిలిస్తుందని, రాజ్యాన్ని చెక్కముక్కలు చేయవద్దని విజ్ఞుడైన బ్రహ్మనాయుడు భావించాడు. విభజనను ఆపేందుకు శతవిధాలా యత్నించాడు. విడిపోయిన తరువాత గురజాలరాజు నలగాముడు. ఆయన మంత్రిణి నాయకురాలు నాగమ్మ. ఈమె సకల శాస్త్రాలు చదివిన విధుషీమణి. అస్త్ర శస్త్ర విద్యలలో ఆరితేరిన వీరవనిత. రాజ్యతంత్రం, ఎత్తులు..పై ఎత్తులు వేయడంలో దిట్ట. వీరు వీరశైవుల పక్షాన నిలిచారు. ఇక మాచెర్ల రాజు మలిదేవుడు. ఆయన మంత్రే బ్రహ్మనాయుడు. నిజానికి బ్రహ్మనాయుడే మొత్తం పల్నాడు రాజ్యాలకు పెద్దదిక్కు. రెండు రాజ్యాలు విడివడక ముందు రాజ్యాన్నంతటినీ తన బుద్ధిబలంతో, భుజబలంతో కాపాడాడు. విస్తరింపజేశాడు.
బ్రహ్మనాయుడికి ప్రజల ఆదరణ..
నలగాముడు, నరసింహులిద్దరూ, నాగమ దేవిని పూర్తిగా నమ్మి ఆమె గుప్పిట్లోకి వెళ్ళడంతో ఇరు పక్షాల మధ్య స్పర్థలు ఎక్కువయ్యాయి. చివరకు రాజ్యం రెండుగా చీలి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నలగామునికి గురజాల, సవతి పిల్లలయిన మలిదేవులకు మాచర్ల రాజ్యాలు భాగాలుగా వచ్చాయి. పల్నాడు నుంచి విడిపడ్డ మలిదేవులు బ్రహ్మనాయుడు నేతృత్వంలో మాచర్ల రాజ్యాన్ని సుభిక్షంగానే పాలించారు. వ్యవసాయం, పశుపోషణకు ప్రాధాన్యమిచ్చి రాజ్యంలో శాంతి, సౌభాగ్యాలను వర్ధిల్లచేశారు. బ్రహ్మనాయుడు తన సామాజిక సిద్ధాంతాలను కొనసాగించాడు. అట్టడుగు వర్గాలలో ప్రభువుల పట్ల తిరుగులేని ఆదరాభిమానాలను, మద్ధతును కూడగట్టాడు.
ఇక్కడే ట్విస్టు…
ఈ సమయంలోనే కథ మరో మలుపు తిరిగింది. మలిదేవరాజు కళ్యాణ దుర్గకు చెందిన కలచూరి రాకుమారిని వివాహమాడడంతో రాజ్యాల బలాబలాలు మారాయి. తమ శత్రువులతో మాచర్ల రాజులు స్నేహం కొనసాగించడమే కాక బంధుత్వాలు కూడా ఏర్పరుచుకోవడం నాయకురాలు నాగమ్మకు నచ్చలేదు. అయితే తన పథకాలు బయటకు చెప్పకుండా ఆ వివాహ వేడుకలలోనే కోడిపందాలనే పాచికను విసిరింది. రక్తంలోని కణకణం పౌరుషంతో నిండిన మాచర్ల రాజులను, బ్రహ్మనాయుడుని యుక్తిగా కోడిపందాలకు సంసిధ్ధం చేసింది నాగమ్మ. అలాగే కుయుక్తితో ఆ కోడిపందాలలో మాచర్ల రాజులను ఓడిస్తుంది, ఏడేళ్ళ పాటు రాజ్య భ్రష్టులను చేస్తుంది. గడువు పూర్తయిన తర్వాత కూడా మాచర్ల రాజ్యాన్ని మలిదేవులకు ఇవ్వకుండా సంధి ప్రయత్నాలకు గండి కొడుతుంది నాగమ్మ దేవి.
బ్రహ్మనాయుడిపై కక్ష గట్టిన నాగమ్మ..
ఆమె పగంతా బ్రహ్మనాయుడి పైనే. ఆయన వర్ణ సంకరానికి మత భ్రష్టత్వానికి పాల్పడుతూ సమాజానికి తీరని అపచారం చేస్తున్నాడనేది ఆమె, ఆమె వర్గం వాదన, భావన. నాగమ్మ తన అపార మేధా సంపత్తిని, శౌర్య కౌశలాలను ఈ విధంగా అపసవ్య దిశలో ఉపయోగించడం వల్లే యుధ్ధం అనివార్యమయింది. బ్రహ్మనాయుడి తర్వాత యుధ్ధంలో చిరస్థాయిగా నిలిచిపోయే వీరుడిగా ఎదిగిన వాడు బాలచంద్రుడు. బాలచంద్రుడు బ్రహ్మనాయుడి కుమారుడు. మహాభారత సంగ్రామంలో అభిమన్యుడి వంటివాడు. యుద్ధ నినాదం వింటేనే ఈయన చెలరేగి పోతాడు. సదా శాంతినే కోరుకునే బ్రహ్మనాయుడు ఈ కారణంగానే, తన పుత్రుడైన బాలచంద్రుడు మత్తుకు, మగువలకు బానిసైపోతున్నా రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న ఉద్ధేశంతో చూస్తూ మిన్నకుండిపోయాడు. కన్నబిడ్డల కన్నా రాజ్య ప్రజలు – వారి సౌఖ్యమే ముఖ్యమని నమ్మిన బ్రహ్మనాయుడి త్యాగనిరతి అనితర సాధ్యం.

అసలు పల్నాటి యుద్ధం ఎందుకు జరిగింది ?
పల్నాటి యుధ్ధం గురజాల, మాచెర్ల రాజ్యాల మధ్య జరిగింది. పల్నాటి యుద్ధాన్ని మహాభారత యుద్ధంతో పోల్చిన వారున్నారు. కొన్ని విషయాల్లో ఈ రెండు యుద్ధాల మధ్య సారూప్యత ఉంది. కురు పాండవ సంగ్రామం దాయాదుల మధ్య రాజ్యం కోసం జరిగింది. పల్నాటి యుద్ధం కూడా అన్నదమ్ముల పిల్లల మధ్యే జరిగింది. ఇక్కడ కూడా రాజ్యకాంక్షే యుద్ధ కారణాల్లో ముఖ్యమైందిగా కనిపిస్తుంది. మహాభారత సంగ్రామంలో వీరులంతా ఒక్కొక్కరు ఎలా నేలకొరిగారో పల్నాటి యుద్ధంలో కూడా రెండు రాజ్యాల వీరాధి వీరులెందరో బలయ్యారు. విజయమో వీరస్వర్గమో అంటూ పల్నాటి ప్రతాపం చూపించి అమరులయ్యారు. మహా భారత యుద్ధానికి జూదం ఒక కారణం కాగా, పల్నాటి రణానికి కోడిపందాలు ఒక కారణంగా నిలిచాయి. అయితే ఈ రెండు యుద్ధాల మధ్య కొన్ని భేదాలు కూడా ఉన్నాయి. పల్నాటి యుద్ధం ప్రబలడానికి వీరశైవం, వైష్ణవం వర్గాల మధ్య రగిలిన పగలు, కక్షలు కార్పణ్యాలు కూడా ప్రధాన భూమిక పోషించాయని చరిత్రకారుల విశ్లేషణ. నిమ్న వర్గాలకు చెందిన అనపోతును చిన్నతనంలోనే చేరదీసి సకల యుద్ధ విద్యలను నేర్పించి సర్వ సేనానిగా చేశాడు బ్రహ్మ నాయుడు.
యుద్ధం అయిన తరువాత చలించిపోయిన బ్రహ్మనాయుడు…
యుద్ధానంతరం ఆ హృదయ విదారక దృశ్యం చూసిన శాంతి కాముకుడు బ్రహ్మనాయుడు చలించిపోయాడు. ఆయన మనసు కకావికలమయింది. యుద్ధం అనే రాక్షసి ఎంతటి వినాశనాన్ని కలిగిస్తుందో, బీభత్సం సృష్టిస్తుందో తెలిసినా నివారించలేకపోయినందుకు తీవ్రంగా కుంగిపోయాడాయన. సామాన్యుల రక్తం నాగులేటి ఏరులై పారిన తర్వాత గాని నాయకురాలు నాగమ్మ లాంటి కొందరికి జ్ఞానోదయం కాదు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒకడు నూరు ప్రాణాలు తీయగలడేమో కానీ ఒక్క ప్రాణం కూడా పోయలేడని బ్రహ్మన్న అనడం ఆయన మానవతావాదానికి అద్దం పడుతుంది. మహోన్నత మానవతావాదులు, దార్శనికులు ఉద్భవించిన జాతి మహా పటిష్టమవుతుందని అంటారు. అలాగే యోధుల సాహస కృత్యాలను జ్ఞాపకం చేసే కథలు వినగల జాతి కూడా శక్తిమంతమవుతుందనీ చెప్తారు. ఈ రకంగా చూస్తే ఎందరో యోధానుయోధులను కన్న తెలుగు గడ్డ ప్రపంచానికే ఆదర్శ ప్రాయం అవుతుంది. సర్వమానవ సమాత్వాన్ని ఆచరణలో చూపిన సాహసి, కుల వ్యవస్థలను బద్దలుకొట్టిన సంస్కరణవాది, శౌర్య ప్రతాపాలున్నా.. సదా శాంతినే ఆకాంక్షించిన మహోన్నత మానవతామూర్తి పల్నాటి బ్రహ్మనాయుడు.. తరతరాలకు ఆదర్శప్రాయుడు, మార్గదర్శకుడు.

 

About admin

One comment

  1. రవీన్ కుమార్

    మీరు బ్రాహ్మనాయుడి గురించి వర్ణించిన తీరు అద్భుతం.. పలనాడు చరిత్ర ఇంకా వివరంగా..నిస్వార్ధం తో అందించగలరని ఆకాంక్షిస్తున్నాను…పల్నాడు ఇన్ఫో.కామ్ ప్రయత్నం అభినందనీయం

    – రవీన్ కుమార్
    భరోసా సొసైటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *