Home / Devotional / దసరా నవరాత్రులు: దుర్గా దేవి 9 అలంకరణ రూపాలు …

దసరా నవరాత్రులు: దుర్గా దేవి 9 అలంకరణ రూపాలు …

దసరా హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తర్వాత‌ మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. అలా అమ్మవారు బాలాత్రిపుర సుందరి .. గాయత్రి .. అన్నపూర్ణ .. మొదలైన రూపాలతో దర్శనమిస్తూ ఉంటుంది. ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. మరి నవరాత్రుల్లో దర్శనమిచ్చి అమ్మవారి రూపాలేంటో తెలుసుకుందాం
 
దేవీ నవరాత్రులు – విశేషాలు :
చాంద్రమానం ప్రకారం పౌర్ణమి నాడు చంద్రునితో కలసి ఉండే నక్షత్రాన్ని బట్టి ఆమాసం పేరు వస్తుంది. ఈ మాసంలో శుక్ల పక్ష పాడ్యమి మొదలు నవమి వరకు గల నవ రాత్రులను శరన్నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అంటారు. దక్షిణాయనంలో ఇది హిందువులకు ఎంతో ప్రాముఖ్యత గల పండుగ ఉపనిషద్వాక్యమైన ‘మాత్రు దేవోభవకు ప్రతిబింబంగా మన సంస్కృతిని పరివారాన్ని సమైక్యతను పరిరక్షించే పవిత్ర స్త్రీ మూర్తిని ఈ శరన్నవరాత్రులలో సర్వ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి రూపంలో శక్తి ప్రదాతయైన దుర్గగా జ్ఞానప్రదాతయైన సరస్వతిగా ఐశ్వర్య ప్రదాతయైన లక్ష్మిగా పూజిస్తాం.
మనకు దసరాలలో బొమ్మలకొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. కొందరు సంక్రాంతికి పెడతారు. రకరకాల బొమ్మలను కొలువుగా తీర్చిదిద్ది పిల్లలను ముత్తైదువులను పేరంటానికి పిలిచి, రోజుకొక తీపి పదార్థాన్ని అమ్మవారికి నివేదిస్తారు. పాటలతో భజనలతో ప్రార్థనలతో జగదంబను స్తుతిస్తారు. దసరాలో నవమిని మహానవమి, మహార్నవమి అంటాం. ఇది అత్యంత ప్రధానమైన రోజు. మహార్నవమిరోజు జగదంబను తప్పనిసరిగా పూజించాలి. దశమినాడు పున్ణ పూజ, ఉద్వాసన జరుపుతారు. విద్యార్ధులు తదితర చదువరులు మూలనక్షత్రంలో సరస్వతీ పూజ చేయాలి. ఎక్కువగా ఉత్తరభారతీయులు విజయదశమినాడు శమీ పూజ చేస్తారు. ఈ రోజు పురజనులు ఊరి సరిహద్దులు దాటి ఈశాన్యదిక్కుగా ప్రయాణించి శమీపూజ నిర్వహించి వెనక్కి తిరిగి వస్తారు. దీనినే సీమోల్లంఘన అంటారు. అంటే సీమ (సరిహద్దు)ను ఉల్లంఘించడం (దాటడం). విజయదశమి నాడే షిరిడి సాయిబాబా మహా సమాధి చెందారు.
ఈ దసరా నవరాత్రులు ఎంతో సరదాగా సందడిగా ఉండి మనలో భక్తిని స్నేహాన్ని సౌభ్రాతృత్వాన్ని కలిగిస్తాయి. అనంత నామాలు రూపాలు గల అమ్మవారిని ఏ నామంతోగాని ఏ రూపంతో గాని భక్తి -ప్రపత్తులతో ఆరాధించే వారికి సర్వము మంగళకరము, శుభప్రదము.
 
అమ్మవారి అలంకరణలు :
1వ రోజు – శ్రీ బాల్ర‌తిపుర సుంద‌రిదేవి
2వ రోజు – శ్రీ గాయ‌త్రి దేవి
3వ రోజు – శ్రీ అన్న‌పూర్ణాదేవి
4వ రోజు – శ్రీ కాత్యాయ‌ని దేవి
5వ రోజు – శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి – లలిథ పంచమి
6వ రోజు – శ్రీ మహా లక్ష్మీ దేవి – మహాషష్టి
7వ రోజు – శ్రీ మహా సరస్వతీ దేవి – మహా సప్తమి
8వ రోజు – శ్రీ మహిషాసురమర్దిని – మహార్నవమి
9వ రోజు – శ్రీ రాజరాజేశ్వరి – విజయదశిమి
మొదటిరోజు: బాలాత్రిపుర సుందరి :
మొదటి రోజు అమ్మవారి స్వరూపం బాలా త్రిపుర సుందరి. శ్రీశక్తి కౌమారి రూపం ”బాల” -. అమ్మవారి మూడు రూపాలలో కనిపిస్తుంది – ఒకటి కుమారిగా బాలత్రిపుర సుందరి, రెండు యవ్వనవతిగా లలితాత్రిపుర సుందరి, మూడు వృధ్ధరూపం త్రిపురభైరవి. బాల త్రిగుణైక శక్తి – సరస్వతి విఙ్ఞానం, కాళిక శక్తి, లలిత సౌభాగ్యం కలుపుకున్నది. బాల ఆనందప్రదాయిని. బాల్యంలో ఉన్న నిర్మలత్వానికి ప్రతీక. మనసు,బుద్ధి, అహంకారం ఈ తల్లి అధీనంలో ఉంటాయి. అభయహస్తం, అక్శమాల ధరించిన బాలరూపాన్ని ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి, నిత్యసంతోషం కలుగుతుంది. శ్రీ చక్రంలో మొదటి దేవత బాల. కాబట్టి త్రిపుర సుందరి అనుగ్రహంకోసం ఉపాసకులు ముందు బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అందించే తల్లిగా బాల భక్తుల పూజలందుకుంటుంది. ఈ రోజు రెండు నుంచి పదేళ్ళలోపు బాలికలకు అమ్మవారి స్వరూపంగా పూజ చేసి, కొత్తబట్టలు పెట్టాలి. ”ఓం ఐం హ్రీం శ్రీం బాల త్రిపుర సుందర్యై నమ్ణ” అని నూటా ఎనిమిది సార్లు చదవాలి. అమ్మవారికి ప్రత్యేకం గా పాయస నైవేద్యం పెట్టాలి. త్రిశతి పారాయణం చెయ్యాలి.
రెండోరోజు: శక్తి అవతారం  -గాయత్రి దేవి :
రెండో రోజు అమ్మవారిని గాయత్రిదేవిగా అలంకరిస్తారు. గాయత్రి సకల వేద స్వరూపిణి. అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూలమంత్రం. తల్లి ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటుంది – అవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. చేతులలో శంఖ, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం ఆమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపఈ రుద్రుడు ఉంటారు. అమ్మ ప్రాత్ణకాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్నకాలంలో సావిత్రిగాను, సాయంసంధ్యలో సరస్వతిగానూ పూజలందుకుంటోంది. గాయత్రీ ధ్యానం అనంత మంత్రశక్తి ప్రదాత. అన్ని కష్టాలు, ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. ఆది శంకరులవారు గాయత్రీమాతను అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద (నాలుగువేదాల) పారాయణం అంత ఫలితాన్ని ఇస్తుంది. నవరాత్రులలో ఈ రోజు అమ్మవారిని ఉపాసన చేసి, అల్లపు గారె నివేదన చెయ్యాలి. గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చెయ్యాలి. గాయత్రి స్తోత్రాలను పారాయణ చెయ్యాలి.
మూడోరోజు: అన్న‌పూర్ణాదేవి :
అన్నం పరబ్రహ్మ స్వరూపం. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లి అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్ధం ఈ అవతారికలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయశుభాలను అందిస్తుంది.అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్పూర్తి, వాక్శుద్ది, వాక్సిద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. భక్తుని సకలసంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి. బుద్ధి ఙ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణభక్తితో తనను కొలిచైన భక్తుల పోషణభారం ఈమె వహిస్తుందని అర్షవాక్యం.ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరిమ్చి, తెల్లని పుష్పాలతో పూజ చెయ్యాలి. ”హీం శ్రీం, క్లీం ఓం నమోభగత్యన్నపూర్ణేశి మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా” అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి దధ్యోజనం, కట్టెపొంగలి నివేదనం చెయ్యాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణ చెయ్యాలి.

నాలుగోరోజు: కాత్యాయ‌ని దేవి :
శరన్నవరాత్రి మహోత్సవాలలో తిథుల హెచ్చుతగ్గుల వలన ఒక్కొక్కసారి 11 రోజులు అలంకారము చేయవలసి వస్తుంది. ఈ దుర్మఖ నామ సంవత్సరం అమ్మవారిని ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు కాత్యాయనిదేవిగా అలంకరించి పూజిస్తున్నారు. సింహ వాహనంపై అధిరోహించి కరవాలం చేతబట్టి రాక్షసత్వాన్ని నశింపజేసే జగద్రక్షణిగా నేడు కాత్యాయనీ దేవి శోభిల్లుతుంది. బీజాక్షరాల మధ్య మహామంత్ర స్వరూపిణియై విరాజిల్లుతూ కాత్యాయని దుర్గాదేవి అంశగా పూజలందుకుంటుంది.మహిషాసురుడిని అంతమొందించడానికి ముక్కోటి దేవతలు మరియు త్రిమూర్తుల తేజస్సుల అంశతో కాత్యాయనీ దేవికి శక్తిని ప్రసాదించి లోకకల్యాణం గావించారు. అనేకమంది రాక్షసులను అంతమొందించిన కాత్యాయనీదేవి భక్తుల పాలిట కల్పవల్లి. ఆ తల్లిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్ధాలు సిద్ధిస్తాయి. రోగములు, భయాలు, శోకములు నశిస్తాయి. ఆయురారోగ్యైశ్వర్యాలు కలుగుతాయి. రవ్వకేసరి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి.
అయిదోరోజు: లలితా త్రిపురసుందరి :
త్రిపురత్రయంలో రెండో శక్తి లలితా త్రిపుర సుందరి. దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వరీ స్వరూపం ఈ తల్లి. పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టాన దేవతగా లలితాత్రిపుర సుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరుకుగడ, విల్లు, పాశాంకుశములను ధరించిన రూపంతో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి పూజలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్య్ర ద్ణుఖాలను తొలిగించి, సకల ఐశ్వర్యాభీష్టాలను ఈమె సిద్ధింపజేస్తుంది. ఈమె శ్రీవిద్యా స్వరూపిణి, సృష్టి, స్థితి, సంహార రూపిణి. కుంకుమతో నిత్యపూజలు చేసే సువాసినులకు (ముత్తైదువులకు) ఈ తల్లి మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీచక్రానికి కుంకుమార్చన చెయ్యాలి. లలితా అష్టోత్తరంతో పూజించాలి. ”ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ్ణ” అనే మంత్రాన్ని సార్లు జపించాలి.
ఆరో రోజు: మ‌హాల‌క్ష్మీదేవి :
కమలాలు రెండు చేతులలో ధరించి, అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా మూడోరోజు శ్రీమహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మి సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి. అమ్మవారు డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తి త్రయంలో మధ్య శక్తి, ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా అంటే అన్ని జీవలలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవని చండీసప్తసతి చెబుతోంది. కాబట్టి శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయి. ”ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పూర్ణాలు నివేదన చెయ్యాలి.లక్ష్మి యంత్రాన్ని పూజించాలి, ఎరుపు రంగు పూలతో పూజించాలి, లక్ష్మీ స్తోత్రాలను పఠించాలి.

ఏడో రోజు: స‌ర‌స్వ‌తిదేవి :
శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉంది. చదువులతల్లి సరస్వతి రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు ఇది. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు వర్ణిస్తున్నాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్టించి, వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి, అభయముద్రతోభక్తుల అఙ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు, మొదలైన లోకోత్తర చరిత్రులకు ఈమె వాగ్వైభవాన్ని వరంగా ఇచ్చింది. త్రి శక్తి రూపాల్లో అమ్మ మూడో శక్తి రూపం, సంగీత- సాహిత్యాలకు అధిష్టాన దేవత. సకల జీవుల జిహ్మగ్రంపై (నాలుకపై) ఈమె నివాసం ఉంటుంది. అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుద్ధి వికాసం కలుగుతుంది. అందుకే ఈ రోజున అమ్మను సరస్వతీరూపంలో ప్రత్యేకంగా పిల్లలతో (విద్యార్ధులు) పూజలు చేయిస్తారు. బాసరలో ఙ్ఞాన సరస్వతీదేవికి ఈ దినం విశేషంగా పూజలు జరుగుతాయి.ఈ రోజు అమ్మవారి ఆధ్వర్యంలో మూలా నక్షత్ర యుక్త పూజతో విశేషంగా అక్షరాభ్యాసం చేస్తారు. దీనిని ”విజయారంభం” అని పిలుస్తారు.
ఎనిమిదో రోజు: మహిషాసుర మర్ధిని :
ఇది అమ్మవారి అతి ఉగ్రమైన రూపం. అశ్వయుజ శుద్ధ నవమి నాడు అమ్మవారు మహిషాసురమర్ధినిగా అవతరించి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసింది. ధర్మ విజయానికి సంకేతంగా అశ్వయుజ శుద్ధనవమినే ”మహార్నవమి”గా భక్తులు ఉత్సవం జరుపుకొంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరిమ్చి, అమ్మ సకల దేవతల అంశలతో మహా శక్తిగాఈ రొజు దర్శనం ఇస్తుంది. మహిషాసురుడనే రాక్షసుడిను వధించిన అమ్మను ఈ దినాన పూజిస్తే శత్రుభయం తొలగి సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకలదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఈ రోజున ప్రత్యేకంగా చండీ సప్తశతి ¬మం చెయ్యాలి. అమ్మవారికి ”ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహినైస్వాహా” అనే మంత్రాన్ని జపించాలి. పూజానంతరం చిత్రాన్నం, గారెలు, వడపప్పు, పానకం నివేదనం చెయ్యాలి.కొన్ని ప్రదేశాలలో ఈ రోజున అమ్మవారి ఉగ్రరూపానికి జంతుబలులు ఇస్తారు. కానీ ఇప్పుడు అది బాగా తగ్గిపోయింది.
Related image
తొమ్మిదో రోజు (విజయదశిమి): రాజరాజేశ్వరీ దేవి :
శ్లో|| సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాథకే,
శరణ్యే త్య్రంబకేదేవి నారాయణి నమోస్తుతే
అంటూ స్తుతిస్తే అమ్మలగన్న అమ్మ దుర్గాదేవి సర్వసంపదలను ప్రసాదిస్తుందని విశ్వాసం. ఆ శక్తి స్వరూపిణి, మహేశ్వరి, పరాశక్తి, జగన్మాత లేకుంటే పరమేశ్వరుడైనా ఏమీ చెయ్యలేడని శివునికి యొక్క శక్తి రూపమే ”దుర్గ” అని ఆదిశంకరాచార్యులు అమృతవాక్కులో పేర్కొన్నారు.ఈ దుర్గాదేవి రాత్రి రూపం గలదని, పరమేశ్వరుడు పగలు రూపం గలవాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత శివునికి అర్ధాంగిగా పూజలందుకుంటున్న మహేశ్వరిని నవరాత్రుల సందర్భంగా రాత్రి సమయాల్లో అర్చిస్తే.. సర్వపాపాలు తొలగిపోయి, సమస్త కోరికలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు. ఎర్రటి బట్టలు ధరించి…పూజకు రాజరాజేశ్వరి, దుర్గాదేవి ప్రతిమనో లేదా పటమునో నల్లకలువలు, ఎర్రటి పువ్వులు పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి పొంగలి, పులి¬ర, అరటిపండ్లు, దీపారాధనకు 9వత్తులతో కూడిన నువ్వుల దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆరు గంటలకు పూజను ప్రారంభించి…రాజరాజేశ్వరి అష్టకం, మహిషాసుర సంహారములను పఠించడం శ్రేయస్కరం. అలాకాకుంటే…”శ్రీ మాత్రే నమ్ణ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించి.. కర్పూర హారతులు సమర్పించుకోవాలి. ఏ శుభకార్యాన్నైనా తిథి, వారము, వర్జ్యము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా.. విజయదశమినాడు చేపట్టిన పని విజయతథ్యమని పురాణాలు చెబుతున్నాయి. ఈ విజయదశమి నాడు స్త్రీలు ఎంతో సుందరంగా బొమ్మల కొలువు తీర్చిదిద్ది ముత్తైదువులను పిలిపించుకుని పేరంటం పెట్టుకుని వారికి వాయినాలతో సత్కరించి వారి ఆశీస్సులను పొందుతారు.

About admin

Check Also

తిరుమలేశుని కంటే ముందే ఆ స్వామికి నైవేద్యం…

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి నివేదించే నైవేద్యం మొదట శ్రీ వరాహమూర్తికి సమర్పించి తరువాతనే శ్రీ వేంకటేశ్వర స్వామికి ఎందుకు సమర్పిస్తారు? …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *